అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దు..

28 Mar, 2020 05:12 IST|Sakshi

సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు వెలుగుతూనే ఉంటుంది

టీటీడీ ఆగమశాస్త్రసలహాదారు రమణ దీక్షితులు 

తిరుమల: తిరుమలలో అఖండ దీపంపై వదంతులను నమ్మొద్దని టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారు రమణ దీక్షితులు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉంటుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

శ్రీవారి సన్నిధిలోని అఖండ దీపం ఆరిపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది వాస్తవం కాదు. 
కరోనా వైరస్‌ను కట్టుదిట్టం చేయడానికి తిరుమలకు కూడా భక్తులకు ప్రవేశం లేకుండా రహదారులను మూసివేశారు.  
ఆలయంలో శ్రీవారికి జరగాల్సిన ఆగమోక్తమైన కైంకర్యాలన్నీ జరుగుతున్నాయి.  
గర్భాలయంలో రెండు అఖండ దీపాలుంటాయి. అవి బయట నుంచి భక్తులకు కనిపించవు. గర్భాలయంలో రెండు నిలువెత్తు వెండి దీపాలు రెండు మూలల్లో ఉంటాయి. ఇవి కాకుండా రెండు నందా దీపాలు స్వామి వారికి ఇరువైపులా వేలాడుతూ కనిపిస్తాయి. ఈ అఖండ దీపాలను ఉదయం సుప్రభాతంలో అర్చకులు బంగారు వాకిలి తలుపులు తెరిచి గర్భాలయ ప్రవేశం చేసినప్పుడు పరిచారకులు వెలిగిస్తారు.  
రాత్రి ఏకాంత సేవలో స్వామివారు వేంచేసినప్పడు ఈ దీపాలను ఆర్పివేస్తారు. మళ్లీ మరుసటి రోజు ఉదయం సుప్రభాతంలో తిరిగి వెలిగిస్తారు.  
శ్రీవారి దేవాలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అఖిలాండం అని భక్తులు పిలుచుకునే దీపారాధన ఉంది. ఆలయానికి ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం వెలిగించి, కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటారు.  
ఇప్పుడు భక్తులు లేకపోవడంతో అఖిలాండం వద్ద కర్పూర దీపం ఆరిపోయింది.. ఇదీ వాస్తవం.  
అఖిలాండం ఆరిపోవడాన్ని అపచారంగానూ, లేక వైపరీత్యంగానూ భావించి పూజలు జరపాలని కొందరు సృష్టిస్తున్న వదంతుల్ని భక్తులు నమ్మోద్దు.

మరిన్ని వార్తలు