పోర్టు మనకేనా?

21 Feb, 2014 04:28 IST|Sakshi

 రాజ్యసభలో రామాయపట్నం పోర్టు ప్రస్తావన
 పోర్టు అవసరాన్ని వివరించిన వెంక య్యనాయుడు
అంగీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం
పోర్టు వస్తే జిల్లాకు మహర్దశే
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు :
 జిల్లా వాసుల చిరకాల కోరిక తీరేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశం రాజ్యసభలో గురువారం చర్చకు వచ్చింది. బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ సీమాంధ్రకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రామాయపట్నం పోర్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే జిల్లాకు మహర్దశ పట్టినట్లే. రామాయపట్నం పోర్టు ఏర్పడితే జిల్లాలో నేషనల్ మ్యాన్‌ప్యాక్చరింగ్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ జోన్ (ఎన్‌ఎంఐజెడ్)కు కూడా మోక్షం కలిగే అవకాశం ఉంది. పోర్టు నిర్మాణానికి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.
 
 దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పోర్టు నిర్మించాలని భావించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం 11 శాతం నిధులు ఇచ్చేందుకు కూడా అంగీకరించింది. జిల్లాలో నిర్మించే పోర్టు తమిళనాడులోని ఎన్నూరు పోర్టు తరహాలో ఉండేలా చ ర్యలు తీసుకోవాలని భావించారు. ఈ ప్రాజెక్టు భాగస్వామ్యానికి నేషనల్ మినరల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, విశాఖపట్నం పోర్టు, ఇఫ్‌కో ఫెర్టిలైజర్స్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.  పోర్టుతో పాటు షిప్ యార్డును కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు చేపట్టారు. నెలకు 30 మిలియన్ టన్నుల కార్గొ రవాణా చే సేందుకు అనువుగా ఆరు బెర్త్‌లతో పోర్టు నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. షిప్ బిల్డింగ్ కారిడార్, పిషింగ్ హార్బర్‌లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోర్టు నిర్మాణానికి ఐదు వేల ఎకరాల స్థలాన్ని మార్కు చేశారు.  వీటిలో 1200 ఎకరాలు ప్రైవేటు భూములు, 2200 ఎకరాల్లో ఉన్న ఎనిమిది గ్రామాలను సేకరించేందుకు 420 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. ఇన్ని జరిగాక పర్యావరణ విభాగం నుంచి అనుమతి లభించలేదు. దీంతో రామయపట్నానికి బదులు నెల్లూరు జిల్లా దుగ్గరాజు పట్నంకు పోర్టు వెళ్లింది. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో రామాయపట్నం పోర్టుపై జిల్లా వాసుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు