సర్వాధికారాలు రమేష్‌బాబుకే

23 May, 2015 01:08 IST|Sakshi
సర్వాధికారాలు రమేష్‌బాబుకే

పట్టిసీమపై ప్రభుత్వ నిర్ణయం
చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి అదనపు బాధ్యతలు
ప్రతిపాదనలకు మంత్రి దేవినేని ఆమోదం


హైదరాబాద్: పట్టిసీమ పనుల్లో అక్రమాలు వెలుగుచూడకుండా, ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాల మేరకు అడ్డగోలు బిల్లుల మంజూరు కోసం పోలవరం ఎస్‌ఈ రమేష్‌బాబుకు ఆ పథకంపై సర్వాధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. పట్టిసీమ చీఫ్ ఇంజనీర్ పోస్టు సృష్టించి, ఆయనకు సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించాలంటూ రూపొందించిన ప్రతిపాదనలకు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఆమోదం తెలిపారు.

ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఉత్తర్వులు వచ్చిన మరుక్షణం నుంచి ఈఎన్‌సీతో సంబంధం లేకుండా పట్టిసీమ డిజైన్‌లో మార్పులు చేర్పు లు, పనుల పర్యవేక్షణ, నాణ్యత తనిఖీ, బిల్లు లు పాస్ చేయడం వంటి అన్ని రకాల అధికారాలు రమేష్‌బాబుకే దక్కుతాయన్నాయి.

ఈఎన్‌సీని బైపాస్ చేసి..: పోలవరం ప్రాజెక్టులో చీఫ్ ఇంజనీర్ (సీఈ) పోస్టు కాకుండా ఈఎన్‌సీ పోస్టు ఉంటుంది. రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్‌సీనే పోలవరం సీఈగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పట్టిసీమ డిజైన్‌లో మార్పు చేర్పుల ప్రతిపాదనలు ఈఎన్‌సీ ద్వారానే ప్రభుత్వానికి చేరా లి. బిల్లుల చెల్లింపునకు కూడా ఈఎన్‌సీ ఆమోదం తప్పనిసరి. కాంట్రాక్టర్‌కు నచ్చినట్లుగా డిజైన్ మార్చడానికి, పనులు చేయకపోయినా చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు మంజూరు చేయడానికి ఈఎన్‌సీ అడ్డుపడుతున్నారని నీటి పారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఎన్‌సీని బైపాస్ చేసి బిల్లులు నొక్కేసేందుకు వీలుగా బాధ్యతలన్నీ రమేష్‌బాబుకు అప్పగించారని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా పట్టిసీమ సీఈ పోస్టు సృష్టించడం ద్వారా ఈఎన్‌సీని వ్యూహాత్మకంగా పక్కకు తప్పించారని ఇంజనీర్లు చెబుతున్నారు. పట్టిసీమ సీమ సీఈగా ఎత్తిపోతల పథకం పనులను రమేష్‌బాబు పర్యవేక్షించనున్నారు. ఎంత పరిమాణంలో పని జరిగిందనే విషయాన్ని ఆయన సర్టిఫై చేయనున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ సీఈగా నాణ్యతను తనిఖీ చేస్తారు. పోలవరం ఎస్‌ఈగా బిల్లులను పాస్ చేస్తారు. ఏ టూ జెడ్ పనులు ఒక్కరికే అప్పగించడంతో, పనులు చేయకున్నా చేశామని ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేయడానికి వీలుగానే ఈ ఏర్పాట్లు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి పారుదల శాఖలో సమర్థులైన ఇంజనీర్లందరినీ పక్కనబెట్టి రమేష్‌బాబుకు బాధ్యతలు అప్పగించడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు.

మరిన్ని వార్తలు