'రామినేని' సేవలు సమాజానికి మేలు

13 Oct, 2015 02:58 IST|Sakshi
'రామినేని' సేవలు సమాజానికి మేలు

రామినేని అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు
 సాక్షి, విశాఖపట్నం: డాక్టర్ రామినేని ఫౌండేషన్ (యూఎస్‌ఎ) చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేస్తాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆ సంస్థ సేవలను ఇతరులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. రామినేని ఫౌండేషన్ 16వ వార్షికోత్సవ పురస్కారాల ప్రదాన కార్యక్రమం విశాఖలో సోమవారం రాత్రి నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు విశిష్ట పురస్కారం, సినీనటుడు డాక్టర్ కైకాల సత్యనారాయణ, నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, డెరైక్టర్ డాక్టర్ సి.మృణాళినిలకు విశేష పురస్కారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచిపనికి గుర్తింపు ఉండాలని, అలాంటి మంచి పనులు చేసే వారిని ప్రోత్సహిస్తే మరింత మంది ముందుకొస్తారని చెప్పారు.

విశిష్ట పురస్కార గ్రహీత చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణ చేసిన వారు సంతోషాన్ని, తృప్తిని పొందుతారన్నారు. పొగడ్తలు ప్రమాదకరమైన మత్తు పదార్థం లాంటివని అభివ ర్ణించారు. విశేష పురస్కార గ్రహీత కై కాల సత్యనారాయణ మాట్లాడుతూ రామినేని పురస్కారం తనకు మిక్కిలి సంతోషాన్నిస్తోందని చెప్పారు. అవార్డు గ్రహీతలు మృణాళిని, అంపశయ్య నవీన్‌లు తమను పురస్కారాలకు ఎంపిక చేసిన రామినేని ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ కె.హరిబాబు, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం, కొండవీటి జ్యోతిర్మయి, బీవీ పట్టాభిరాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు