రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట బందోబస్తు

20 Feb, 2019 13:24 IST|Sakshi
భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్న ఐజీ, ఓఎస్డీ, కలెక్టర్, ఎస్పీ

విధుల్లో 2,586 మంది సిబ్బంది

వాహనాల దారి మళ్లింపు

భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు  

 నెల్లూరు(క్రైమ్‌): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడులు జిల్లాకు రానుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 2,586 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. నెల్లూరు నగరంతోపాటు వెంకటాచలం మండలంలో పోలీసులు అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని బైండోవర్‌ చేసుకుంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. గుంటూరు రేంజ్‌ ఐజీ ఆర్‌పీ మీనా, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీ పీవీఎస్‌ రామకృష్ణ, జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగిలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హెలీప్యాడ్‌ మొదలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాలను మంగళవారం వారు పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.

ఇతర జిల్లాల వారు సైతం
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పోలీసులు సైతం బందోబస్తుకు హాజరయ్యారు. ఎస్పీతో పాటు ఆరుగురు అదనపు ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 54 మంది సీఐలు, 150 మంది ఎస్సైలు, 466 మంది ఏఎస్సై/హెచ్‌సీ, 1,009 మంది కానిస్టేబుల్స్, 124 మంది మహిళా కానిస్టేబుల్స్, 464 మంది హోంగార్డులు, ఆర్‌ఐ, ఇద్దరు ఆర్‌ఎస్సైలు, 17 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 112 మంది కానిస్టేబుల్స్‌ 16 స్పెషల్‌ పార్టీలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. రాష్ట్రపతి పర్యటన మొత్తాన్ని విశ్రాంత డీఐజీ, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్డీ పీవీఎస్‌ రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.

నగరంలో ట్రాఫిక్‌ దారి మళ్లింపు
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్‌ను దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. ఉప రాష్ట్రపతి ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం వద్ద నెక్లెస్‌రోడ్డు పనులు పరిశీలించనున్న నేపథ్యంలో జొన్నవాడ నుంచి దేవస్థానం మీదుగా నగరంలోకి వచ్చే వాహనాలు పొట్టేపాళెం గ్రామం మీదుగా పుత్తా ఎస్టేట్, గుప్తా పార్కు మీదుగా నెల్లూరు నగరంలోకి వెళ్లాలి. బుచ్చి నుంచి వచ్చే వాహనాలు రేబాల, దామరమడుగు, వెంకటేశ్వరపురం మీదుగా నగరంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకున్నారు.

అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచాలి. వారు పర్యటించే ప్రాంతాల్లో బాంబ్, డాగ్‌స్క్వాడ్‌లు తనిఖీలు చేయడంతోపాటు సిబ్బంది వాహన తనిఖీలు చేయాలి.   – ఆర్‌పీ మీనా, ఐజీ 

మరిన్ని వార్తలు