ఫైబర్‌ నెట్‌తో నాణ్యమైన పౌర జీవనం

28 Dec, 2017 01:42 IST|Sakshi

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడి

ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు అంకితమిచ్చిన రాష్ట్రపతి  

సాక్షి, అమరావతి :  ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్స్‌ ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఫైబర్‌ నెట్‌తో సమయాన్ని వృథా చేసుకోవద్దని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు. దీన్ని ఆనందం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పారు.

గ్రీన్‌ఫీల్డ్‌గా అమరావతి అభివృద్ధి
గతంలో హైదరాబాద్‌ను బ్రౌన్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేశామని, ఇప్పుడు అమరావతిని గ్రీన్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, హైకోర్జు జడ్జి జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యం, మండలి చైర్మన్‌ ఫరూక్, అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి కోవింద్‌ సచివాలయంలోని ఒకటో బ్లాకులో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీ) విభాగానికి వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. తర్వాత సచివాలయంలోనే రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక విందు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు