ఆమె ఆత్మశాంతి కోసం..

26 Sep, 2019 12:13 IST|Sakshi
(అంతర చిత్రంలో) రమ్యశ్రీ, కోటిలింగాల ఘాట్‌ వద్ద రమ్యశ్రీకి కర్మకాండలు నిర్వహిస్తున్న తండ్రి సుదర్శన్, తల్లి భూలక్ష్మి

రమ్యశ్రీకి కర్మకాండలు నిర్వహించిన తల్లిదండ్రులు

మృతదేహాల కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో బంధువుల ఎదురుచూపులు

తూర్పుగోదావరి,తాడితోట (రాజమహేంద్రవరం): డాడీ! అని ఎవరు పిలిచినా మా అమ్మాయే పిలిచినట్టు అనిపిస్తోందని బోటు ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ తండ్రి సుదర్శన్‌ పేర్కొన్నారు. ఈనెల 15న దేవీపట్నం మండలం కుచ్చులూరులో జరిగిన బోటు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన విద్యుత్‌శాఖ ఏఈ కారుకూరి రమ్యశ్రీ గల్లంతైంది. పది రోజులుగా ఆమె ఆచూకీ కోసం ఎదురుచూసిన తల్లిదండ్రులు, ఎంతకీ లభ్యం కాపోవడంతో మృతదేహం దొరకకుండానే, మరణించిందని భావించి ఆమె ఆత్మశాంతి కోసం 11వ రోజైన బుధవారం రాజమహేంద్రవరం కోటిలింగాల రేవులో గోదానం చేసి, కర్మకాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమ్యశ్రీ తండ్రి సుదర్శన్‌ మాట్లాడుతూ 10 రోజులుగా మృతదేహం కోసం ఎదురుచూశామని, దొరికిన మృతదేహాలు గుర్తు పట్టడానికి వీలులేకుండా ఉన్నాయన్నారు.

తన కుమార్తె మృతదేహం వస్తుందో! రాదో! తెలియని అయోమయ పరిస్థితుల్లో 11వ రోజు కర్మకాండ నిర్వహించకపోతే ఆమె ఆత్మకు శాంతి చేకూరదని పండితులు చెప్పడంతో ఆమె ఆత్మశాంతి కోసం కర్మకాండ నిర్వహించామని తెలిపారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నామని, విద్యుత్‌ శాఖలో ఏఈగా పని చేస్తుండేదని తెలిపారు. బోటు దిగిన తరువాత ఫోన్‌ చేస్తానంటూ మెసేజ్‌ పెట్టిందని, కడసారి చూపు కూడా చూడకుండానే వెనుదిరిగి వెళ్లాల్సి వస్తోందని రమ్యశ్రీ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి కర్మకాండలు ముగిసినా తన కుమార్తెను తలచుకుంటూ కోటిలింగాల రేవులోనే ఎక్కువ సమయం ఉండిపోయారు.

మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు
వాడపల్లి వద్ద మంగళవారం లభించిన పురుషుడి మృతదేహం తమదంటే తమదని ఇరుకుటుంబాల బంధువులు అంటున్నారు. కాకినాడకు చెందిన బోటు డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ(60) మృతదేహంగా అతడి కుమారుడు పొతాబత్తుల కుమార్‌ చెబుతుండగా, బోటులో సహాయకుడిగా పనిచేస్తున్న పాత పట్టిసీమకు  కర్రి మణికంఠ మృతదేహంగా అతడి తండ్రి, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహానికి గురువారం డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 

మృతదేహాల కోసం ఎదురుచూపులు..
తమ కుటుంబ సభ్యులు, బంధువుల మృతదేహాల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పలువురు ఎదురు చూపులు చూస్తున్నారు. రమ్యశ్రీ మృతదేహం కోసం ఆమె తల్లిదండ్రులు, బోటు డ్రైవర్లు పోతాబత్తుల సత్యనారాయణ, నూకరాజు మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్‌ కు చెందిన అంకం పవన్‌కుమార్, అతడి భార్య వసుంధరా భవానీ మృతదేహాల కోసం అతడి మేనమామ మట్టా రాజేంద్ర ప్రసాద్‌ ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి చేరని మహిళ మృతదేహం
బుధవారం రాత్రి సీతానగరం ఎస్సైకు మహిళ మృతదేహం అప్పగించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తారని మృతుల కుటుంబాల వారు ఎదురుచూసినా రాత్రి వరకు రాకపోవడంతో నిరాశ చెందారు. ఆ మృతదేహం బోటు ప్రమాదంలో మృతిచెందిన వారిది కాదేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు