విశాఖ గ్యాస్‌ లీకేజీ: ‘బాధితులకు అండగా ఉంటాం’

7 May, 2020 14:31 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : విశాఖలో స్టెరైన్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనపై మంత్రులు రంగనాథ రాజు, తానేటి వనిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై మంత్రులు మాట్లాడుతూ.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటనపై అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి, బాధితులను ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని, స్టెరైన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం వెంటనే విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. (విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం)

బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో కలిసి విశాఖపట్నం వెళ్లారని, ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎల్జి పాలిమర్స్‌ కంపెనీకి 45 డ్యూటీ పాసులు ఇచ్చామని, 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో నిలువ ఉంచాల్సిన స్టెరైన్‌ గ్యాస్‌ నిర్వహణ లోపం వల్ల లీక్‌ అయినట్లుగా భావిస్తున్నామన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని, బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. (గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌ )

మరిన్ని వార్తలు