ర్యాంకర్లకు నిరాశ

23 Feb, 2014 01:09 IST|Sakshi
ర్యాంకర్లకు నిరాశ
  •     వీఆర్‌ఏ ఫలితాల్లో విచిత్ర పరిస్థితి
  •      మార్కులతో సంబంధం లేకుండా పోస్టులు
  •  సాక్షి, విశాఖపట్నం: గ్రామ రెవెన్యూ సహాయక(వీఆర్‌ఏ) పోస్టులకు జరిగిన పరీక్షల్లో వారు జిల్లాకే ఫస్ట్ మార్కు సాధించారు. ఇద్దరివీ నూటికి 82 మార్కులే. అయి తే జనరల్ ర్యాంకుల్లో మాత్రం వారు 130, 131వ స్థానాల్లోకి వెళ్లిపోయారు. 76 మార్కులొచ్చిన వ్యక్తి ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు. క్షేత్రస్థాయిలో పోస్టు, స్థానికత ఆధారంగా ర్యాంకులు నిర్ణయించడంతో.. మార్కుల తో సంబంధం లేకుండా పోస్టులు కేటాయించనున్నారు.
     
     ప్రథములు వీరే..: వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.వీఆర్వో ఫలితాల్లో సబ్బవరం మండలంలోని లగిశెట్టిపాలెంకు చెందిన రెడ్డి నూకరాజు 96 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీ ఆర్‌ఏ ఫలితాల్లో జిల్లాలో అత్యధికంగా 82 మా ర్కులు తెచ్చుకున్న గోపాలపట్నానికి చెందిన మండలెముల గుణలక్ష్మి, ఎస్.రఘురాం గొడపర్తి130, 131 ర్యాంకుల్లో నిలవగా, చీడికాడ మండలంలోని తరువోలుకు చెందిన బొడ్డు సింహాచలంనాయుడు 76 మార్కులు సాధించినప్పటికీ స్థానికత ఆధారంగా జిల్లాలో ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచారు.
     
     కేటగిరీల వారీ పోస్టులు
      ఈ నెల రెండున జరిగిన పరీక్షల్లో జిల్లాలోని 41 వీఆర్‌వో పోస్టుల కోసం 19,160 మంది, 12 వీఆర్‌ఏ పోస్టుల కోసం 738 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలోపి 12 వీఆర్‌ఏ పోస్టుల్లో ఓసీ జనరల్-2, మహిళలు-3, ఎస్సీ మహిళలు-3, బీసీ ఏ మహిళ కేటగిరీలో 4 పోస్టులున్నాయి. వీఆర్వో కేటగిరీలోని 41 పోస్టుల్లో ఓసీ మహిళలు-7, ఎస్సీ జనరల్-8, మహిళలు-4, ఎస్టీ మహిళలు-1, బీసీఏ జనరల్-5, మహిళలు-2, బీసీబీ జనరల్-4, మహిళలు-1, బీసీ సీ మహిళలు-1, బీసీ ఇ జనరల్-3, ఎక్స్-సర్వీస్‌మెన్-2, వికలాంగుల్లో వీహెచ్ మహిళలు, హెచ్‌హెచ్ జనరల్, ఓహెచ్ జనరల్ కేటగిరీలో ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి.
     
     ఎంబీఏ చేసినా వీఆర్వోనే ముద్దు
     సబ్బవరం: మండలంలోని ఆరిపాక పంచాయతీ లగిశెట్టిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి నూకరాజుకు వీఆర్వో పరీక్షల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన నూకరాజు ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ తాను 8వ తరగతి వరకు ఆరిపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివానని, 9, 10 తరగతులు సబ్బవరం విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్లో చదివానన్నారు. డిగ్రీ విశాఖలోని మహతి డిగ్రీ కళాశాలలోను, ఎంబీఏ పైడా కాలేజిలోను చదివినట్టు  తెలిపారు. తాను ఎంబీఏ చేసినా వీఆర్వో పరీక్షలు రాసి వీఆర్వో ఉద్యోగం ద్వారా గ్రామీణ ప్రజలకు సేవలందించాలనే ఈ పరీక్షకు హాజరయ్యానంటున్నాడు. తండ్రి ఈశ్వరరావు, తల్లి చోడమ్మ వ్యవసాయం చేస్తున్నారు. భవిష్యత్‌లో గ్రూప్‌వన్ పరీక్షలకు హాజరవుతానని  తెలిపారు.
     
     తురువోలు విద్యార్థికి వీఆర్‌ఎ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్
     చీడికాడ: మండలంలోని తురువోలుకు చెందిన బొడ్డు సింహాచలం నాయుడు వీఆర్‌ఎ ఫలితాల్లో జిల్లా ప్రథమ ర్యాంక్ సాధించాడు.  జనరల్ కేటగిరిలో 76 మార్కులు సాధించాడు. తండ్రి చనిపోయాడు. వ్యవసాయ కుటుంబం. సింహాచలంనాయుడు మొదట్నుంచీ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. ప్రస్తుతం అనకాపల్లిలో పీజీ చదువుతున్నాడు. ఎలాంటి కోచింగు లేకుండా ప్రథమ ర్యాంకు సాధించాడు.
     

మరిన్ని వార్తలు