ఐకేపీ మహిళపై డీఆర్డీఏ పీడీ అత్యాచారం?

14 Mar, 2014 08:54 IST|Sakshi
ఐకేపీ మహిళపై డీఆర్డీఏ పీడీ అత్యాచారం?

పశ్చిమగోదావరి జిల్లా డీఆర్డీఏ పీడీ శివశంకర్పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశంతో త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీడీ శివశంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్ష లు నిర్వహించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ హరికృష్ణను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.లక్ష్మీశారద ఆదేశించారు.

నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత (32) ఐకేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తోంది. ఏలూరు సమీపంలోని వట్లూరు టీటీడీసీలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆమెకు ఫోన్ రావడంతో నిడదవోలు ఐకేపీ కార్యాలయంలో పని ముగించుకుని సాయంత్రం ఏలూరు చేరుకుని, అక్కడ నుంచి ఆటోలో టీటీడీసీకి వెళ్లింది. అక్కడ పని పూర్తయ్యేసరికి రాత్రి 10.15 కావడంతో రాత్రికి అక్కడే పడుకుని ఉదయం వెళ్లిపోవాలని భావించింది. అయితే, అక్కడకు వచ్చిన నైట్ వాచ్‌మెన్ బాబూరావు ఆమెను డీఆర్‌డీఏ పీడీ శివశంకర్, గెస్ట్‌హౌస్‌లో ఉన్న తన రూమ్‌కు రమ్మన్నారని చెప్పాడు.
 
వివాహిత అక్కడకు వెళ్లగా ఆయన ఆమెను రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు బాధితురాలు తెలిపింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తప్పించుకుని బయటకు వచ్చి,ఉదయాన్నే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని అదే సెంటర్‌లోని ఉద్యోగులైన ఇందిర, జమునలకు తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు డీఆర్‌డీఎ పీడీ కె.శివశంకర్‌పై ఐపీసీ సెక్షన్ 176(బి) కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు