రబీకి 2 బ్యారేజీలు

4 May, 2020 04:11 IST|Sakshi

శరవేగంగా సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం

నెల్లూరు బ్యారేజీలో మిగిలిన రూ.113.36 కోట్ల పనులు 

కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలని నిర్ణయం

సాక్షి, అమరావతి: పెన్నా నదిపై నిర్మాణంలో ఉన్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేసి ఈ ఏడాదే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెల్లూరు బ్యారేజీ కింద 99,525 ఎకరాలు, సంగం బ్యారేజీ కింద 3.85 లక్షల ఎకరాలు వెరసి 4,84,525 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్దేశించుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పనులు చేయలేనని, నెల్లూరు బ్యారేజీ కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగేందుకు అనుమతించాలంటూ కాంట్రాక్టర్‌ చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. మిగిలిన రూ.113.36 కోట్ల విలువైన పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి అక్టోబర్‌ నాటికి పూర్తి చేసేలా జలవనరుల శాఖ కసరత్తు చేస్తోంది. సంగం బ్యారేజీ పనులను సెప్టెంబరులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది.

 ప్రాధాన్యతగా  నెల్లూరు బ్యారేజీ..
► నెల్లూరు కొత్త బ్యారేజీ పనుల్లో 8 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు, 8.36 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు మిగిలాయి.
► బ్యారేజీకి 57 గేట్లను బిగించాల్సి ఉండగా తయారీ పనులు 75% పూర్తయ్యాయి. మిగిలిన రూ. 113.36 కోట్ల పనులను ప్రాధాన్యతగా పరిగణించి కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి అక్టోబర్‌ నాటికి బ్యారేజీని జాతికి అంకితం చేయనున్నారు.

శరవేగంగా సంగం బ్యారేజీ
► కొత్తగా నిర్మిస్తున్న సంగం బ్యారేజీలో మిగిలిపోయిన పది వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. మిగిలిన 2.16 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పురోగతిలో ఉన్నాయి.
► బ్యారేజీకి గేట్ల తయారీ పనులు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం రూ.145.51 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం 
అంగీకరించింది.
► సంగం బ్యారేజీని సెప్టెంబరు నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 చేతులెత్తేసిన చంద్రబాబు..
► వందేళ్ల క్రితం నిర్మించిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. వీటి స్థానంలో కొత్త బ్యారేజీల నిర్మాణాన్ని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2004లో చేపట్టారు. 2009 నాటికి సింహభాగం పనులు పూర్తయినా తర్వాత గ్రహణం పట్టుకుంది.
► 2018 ఖరీఫ్‌ నాటికి రెండు బ్యారేజీలను పూర్తి చేస్తామని నాడు అధికారంలో ఉండగా శాసనసభ సాక్షిగా పలు సందర్భాల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు చేతులెత్తేశారు. 

మరిన్ని వార్తలు