పెద్ద ప్రాణం నిలిపారు

3 Aug, 2018 08:36 IST|Sakshi
గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌ బేగంకు కృతజ్ఞతలు చెబుతున్న బాలింత యాస్మిన్, చిత్రంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ (ఇన్‌సెట్‌) యాస్మిన్‌

పెద్దాస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

గైనిక్‌ వైద్యుల ఘనత

మూడు గంటల పాటు శ్రమించి విజయం

ఓ గర్భిణికి ప్రాణం పోసిన డాక్టర్లు

అనంతపురం న్యూసిటీ : అనంతపురం సర్వజనాస్పత్రిలో గైనిక్‌ వైద్యులు కాన్పు కష్టంగా  ఉన్న ఓ గర్భిణికి శస్త్ర చికిత్స చేసి, ఆమె ప్రాణాన్ని కాపాడారు. తల్లీబిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ఛాలెంజింగ్‌గా తీసుకొని మూడున్నర గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కానీ బిడ్డ ప్రాణం దక్కలేదు. అతికష్టంమీద ప్రాణాలు కాపాడిన గైనిక్‌ వైద్యులకు బాలింత, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.  గురువారం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో సర్జరీ విషయాలను గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌బేగం తెలియజేశారు. గుంతకల్లుకు చెందిన ఇర్షాద్, యాస్మిన్‌ దంపతులకు ఇద్దరు సంతానం. ఇప్పటికే రెండు అబార్షన్లు అయ్యాయి. గర్భిణి అయిన యాస్మిన్‌ గత నెల  23న సర్వజనాస్పత్రిలో చేరింది. హెచ్‌బీ పరీక్షించగా 4 గ్రాములు మాత్రమే ఉండడంతో హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతోంది.

అదేరోజు రాత్రి ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌లో గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ షంషాద్‌బేగం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రేణుక, అనస్తీషియా వైద్యులు డాక్టర్‌ సుబ్రమణ్యం, డాక్టర్‌ హరికృష్ణ బృందం సర్జరీ చేశారు. సర్జరీ సమయంలో నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. బాలింతకు మాయ ఊడి పడడంతోపాటు మరో భాగంలో అతుక్కుపోయింది. ఆసమయంలో మాయను తొలగించలేని పరిస్థితి. పరిస్థితి మరింత విషమించింది. చివరకు గర్భసంచి తొలగించారు. కాసేటిపకి పుట్టిన ఆడశిశువు మృతి చెందింది. యాస్మిన్‌కు బీపీ 90కి పడిపోవడంతో పాటు కోమాలోకి వెళ్లింది. వైద్యులు వెంటనే అక్యూట్‌ మెడికల్‌ కేర్‌ యూనిట్‌ (ఏఎంసీ)లోకి మార్చి వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. అదే రోజు రాత్రి మరో 4 యూనిట్ల రక్తం ఎక్కించారు. ఉదయం 4.30 గంటల సమయంలో బాలింత కోలుకుంది. వైద్యులు 24 గంటల పాటు హైలీ యాంటీబయోటిక్స్‌ అందించారు. ఈ నెల 25న ఆమె పూర్తిగా కోలుకోగా పోస్టునేటల్‌ వార్డుకు మార్చారు. బాలింతలో దాదాపుగా 3.5 లీటర్ల రక్తం పోయింది.  సకాలంలో ఆస్పత్రిలోని రక్తనిధి నుంచి 10 యూనిట్ల రక్తాన్ని అందించారు. అందరి సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారు.

యాస్మిన్, ఇర్షాద్‌ దంపతులు మాట్లాడుతూ ‘సార్‌.. ప్రాణాలు దక్కుతాయోలేదో తెలియని పరిస్థితి.. పొరపాటున ఏమైనా జరిగింటే మా ఇద్దరు బిడ్డలు  తల్లిని కోల్పోయేవారు.. దేవుళ్లలా ప్రాణం పోశారు..మీకు రుణపడి ఉంటామని తెలిపారు.

గైనిక్‌ వైద్యుల సాహసమే
ఇలాంటి కేసులు చాలా అరుదు. గైనిక్‌ వైద్యులు సాహసంతో బాలింతకు ప్రాణం పోశారు. నిజంగా చెప్పాలంటే మిరాకిల్‌. గైనిక్, అనస్తీషియా, రక్తనిధి కేంద్రాన్ని అభినందిస్తున్నా. మున్ముందు మరిన్ని సర్జరీలు చేసి ఆస్పత్రికి పేరు తేవాలి.     – డాక్టర్‌ జగన్నాథ్,             ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని వార్తలు