ప్రజల్లో మార్పుతోనే కరోనా దూరం: రష్మి గౌతమ్‌

2 Apr, 2020 08:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: లాక్‌డౌన్‌ అంటే.. శిక్ష కాదనీ.. మన భవిష్యత్తుతో పాటు, భావితరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న బృహత్తర కార్యక్రమమని యాంకర్, సినీనటి రష్మీ గౌతమ్‌ అన్నారు. రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతూ.. పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రాకపోవడం బాధాకరమని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ అనేది బాధ్యతగా భావించాలే తప్ప.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గంటలు సడలింపు ఇస్తుంటే.. అది రిలాక్స్‌ సమయం అన్నట్లుగా అవసరం లేకుండానే రోడ్లపైకి రావడం సరికాదన్నారు. (నా వంతు విరాళం సేకరిస్తున్నాను)

ముఖ్యంగా యువత తమకు కరోనా రాదని అనుకుంటూ.. ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వారి వల్లే వైరస్‌ వారి కుటుంబ సభ్యులకు సోకే అవకాశం ఉందన్నారు. 24 గంటలూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, మీడియా, ప్రభుత్వాధికారులు, సిబ్బందికి సహకరించాలంటే ప్రజలంతా ఇంటిపట్టునే ఉండాలని రష్మి కోరారు. ప్రజలు అవస్థలు పడకుండా కరోనా వైరస్‌ వ్యాపించకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న విధానాల్ని వివిధ దేశాలు ఆదర్శంగా తీసుకుంటుండటం మనందరికీ గర్వకారణమన్నారు. హోమ్‌ క్వారంటైన్‌ పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సూచించారు. సౌమ్యులైన విశాఖపట్నం ప్రజలు ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. (ఆర్జీవీ... ఓ రామబాణం)

మరిన్ని వార్తలు