నిజరూపంలో అరసవెల్లి ఆదిత్యుడు

3 Feb, 2017 10:09 IST|Sakshi
నిజరూపంలో అరసవెల్లి ఆదిత్యుడు

శ్రీకాకుళం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవెల్లిలో సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అర్థరాత్రి ఆదిత్యుని నిజరూప మూర్తికి శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ క్షీరాభిషేకం, ప్రథమ అర్చనలు చేశారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 4 గంటలకు పుష్పాలంకరణ సేవ జరగనుంది. రాత్రి 11 గంటలకు పవళింపు సేవ, మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్షీరాభిషేక దర్శనం టిక్కెట్ల ధరను రూ.500కు పెంచడంతో భక్తులు నిరాశకు లోనయ్యారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉత్తరంలో ఉన్న గోడను పోలీసులు కూల్చివేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులను ఆ మార్గంగుండా అనుమతిస్తున్నారు. పోలీసుల తీరుపై ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వామి వారిని దర్శించుకున్న వారిలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, టీడీపీ నాయకుడు కరణం బలరాం తదితరులు ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు