నేను బాలుడిని కాను మొర్రో..!

1 Mar, 2016 01:16 IST|Sakshi
నేను బాలుడిని కాను మొర్రో..!

అతడి భార్యకు 70 ఏళ్లు. అతడి వయసు మాత్రం ఏడేళ్లే. ఏమిటీ విచిత్రం అనుకుంటున్నారా.. రెవెన్యూ అధికారుల పుణ్యమా అని రేషన్ కార్డులో అలాగే ఉంది మరి! కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల మంగం సూర్యారావు తనకు పింఛను ఇప్పించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. సోమవారం కోరుకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో పింఛను కోసం దరఖాస్తు చేశాడు. రేషన్‌కార్డులో తనకు ఏడేళ్లు అని వేయడం వల్ల పింఛను రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు 2012లో రేషన్‌కార్డు మంజూరైందని పేర్కొన్నాడు.

ప్రస్తుతం తనకు 80, తన భార్యకు 70 ఏళ్ల వయసు ఉందన్నాడు. ప్రతివారం రెవెన్యూ, మండల పరిషత్, సబ్‌కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పింఛను మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కాలు కదపడం కష్టంగా ఉన్న తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని అధికారులను వేడుకున్నాడు.               - కోరుకొండ

మరిన్ని వార్తలు