ఎవరా డీలర్లు..? ఏంటా కథ?

11 Sep, 2019 11:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గతమిది
దొడ్డు బియ్యం, రంగు మారిన బియ్యం, నూకల శాతం ఎక్కువగా ఉండటం, తవుడు కలిసి ఉండటం, నాణ్యత లేమి కారణంగా అధిక శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వం సరఫరా చేసిన బియ్యాన్ని తినేందుకు ఇష్టపడే వారు కాదు. ఇదే అదనుగా రేషన్‌ మాఫియా రంగంలోకి దిగి కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి రైసుమిల్లుల్లో పాలిష్‌ పట్టించి అధిక ధరకు అమ్ముకుంటూ రూ.కోట్లు సంపాదించేవారు. ఈ విధంగా గతంలో పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ యథేచ్ఛగా సాగింది. ఇందులో కొందరు డీలర్లే దళారులుగా వ్యవహరించారు. ప్రభుత్వమిచ్చే ఇన్సెంటివ్‌తో పాటు అడ్డగోలుగా సంపాదించేవారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నియమితులైన టీడీపీ సానుభూతి డీలర్లు రెండు చేతులా ఆర్జించారు.

తాజా పరిస్థితి ఇది
రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా తినగలిగే బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేసింది. తూకంలో తేడాలు, క్షేత్రస్థాయిలో అక్రమాలు చోటు చేసుకోకుండా నేరుగా ఇంటికే బియ్యం ప్యాకెట్లను అందజేస్తోంది. ఈ బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. రీసైక్లింగ్‌ చేసుకునేందుకు చాన్స్‌ ఉండదు. పీడీఎస్‌ బియ్యం దళారులకు, అక్రమాలకు పాల్పడే డీలర్లకు అడ్డగోలుగా సంపాదించే అవకాశం లేకుండా పోయింది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేసిన ఈ ముందడుగు కొందరు డీలర్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నియమితులై అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించిన టీడీపీ సానుభూతి డీలర్లకు అస్సలు రుచించడం లేదు. తమ ఆదాయానికి ప్రభుత్వం గండికొట్టడంతో పాటు గ్రామాల్లో రాజకీయ ఆధిపత్యాన్ని కోల్పోతున్నామన్న భయం పట్టుకుంది. ఇంకేముంది ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యంపై బురద జల్లే కార్యక్రమానికి ఒడిగట్టారు.

గతంలో తమ వద్ద ఉన్న బియ్యం ఫొటోలను, ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన బియ్యం ప్యాకెట్లను బయటికి వదిలి దుష్ప్రచారానికి దిగారు. పచ్చబ్యాచ్‌తో కలిసి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారానికి దిగారు. దీని వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గి, ఇంటింటికి రేషన్‌కు స్వస్తి చెప్పి, ఎప్పటిలాగే తమ చేతుల్లోనే ప్రభుత్వం పెడుతుందనేది వారి ఆశ. కానీ కుట్రదారుల పప్పులుడకలేదు. సామాజిక మాధ్యమాల్లో చేసిన ప్రచారాన్ని అధికారులు తిప్పికొట్టారు. ఎక్కడైతే తడిచిన బియ్యం ప్యాకెట్లు అందాయో అక్కడ వెంటనే రీప్లేస్‌ చేశారు. దీంతో ఎక్కడా ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదు. సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. నిరుపేదల కళ్లల్లో ఆనందం కనిపించింది.

లెక్క తేల్చేసింది..
జిల్లాలో తెల్ల రేషన్‌కార్డుదారులు 8.31లక్షలు, అందుబాటులో ఉంచిన బియ్యం 13,341 మెట్రిక్‌ టన్నులు, పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యం బ్యాగులు 9,36,941, వెలుగు చూసిన తడిచిన బియ్యం బ్యాగులు 30.. ఈ అంకెలు చూస్తే బియ్యం బాగోలేవని ఎవరైనా చెప్పగలరా? 9లక్షల 36వేల 941బ్యాగులలో ఇటీవల కురిసిన వర్షాలకు 30బ్యాగులు తడవడం వల్ల పాడయ్యాయి. ఈ లెక్కన పాడైన శాతమేంటో అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ సానుభూతి డీలర్ల కనుసన్నల్లో పచ్చబ్యాచ్‌ వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే యత్నానికి దిగింది. కానీ ప్రజలు వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహం ముందు చివరికీ వారి గొంతు మూగబోయింది.

ఆ అక్రమాలకు చాన్స్‌ ఉండదనే 
టీడీపీ సానుభూతి డీలర్లు దళారుల అవతారమెత్తి కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొని రైస్‌మిల్లులకు అమ్మేవారు. ప్రభుత్వం ఈ బియ్యాన్ని కిలో రూ. 30కిపైగా కొని, కార్డుదారులకు ఒక్క రూపాయికి అందజేసేది. ఈ బియ్యాన్నే కిలో రూ. 9నుంచి రూ.10చొప్పున కొని, రైసుమిల్లులకు చేరేసరికి రూ. 20వరకు అమ్ముతున్నారు. పాలిష్‌ అనంతరం ఈ బి య్యాన్నే మాఫియా కిలో రూ. 50వరకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. అలాగే ప్రతి నెలా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన బియ్యం, పంచదారతో పాటు ఇతర సరుకులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించేవారు.

అక్కడి నుంచి కాంట్రాక్టర్ల ద్వారా నుంచి చౌక దుకాణాలకు సరుకులు తరలిస్తున్నప్పుడు అవి నీతి, అక్రమాలు చోటు చేసుకునేవి. గోదాములకు వస్తున్న సరుకుల్లో తక్కువ (షార్జేజీ) వస్తున్నాయని కొందరు డీలర్లు  కోత విధిస్తుండేవారు. బియ్యం బస్తాతో కలిపి 51కిలోల తూకం ఉండాల్సి ఉండగా పరిస్థితుల ప్రకారం 4 నుంచి 6 కిలోల వరకూ కోత విధిస్తుండేవారు. తన నష్టాలను పూడ్చుకునేందుకు ఎలక్ట్రానిక్‌ కాటాల్లో కూడా ప్రజలను మోసం చేసేవారు. వీటన్నింటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బ్రేక్‌ పడింది.

టీడీపీ సానుభూతి డీలర్ల కుట్రపై ఆరా
జిల్లాలో సానుభూతి డీలర్లు 700 వరకు ఉన్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో 300 వరకు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా డీలర్లుగా ఉంటూ గ్రామాల్లో రాజకీయాలు చేస్తున్నారు. భవిష్యత్‌ భయంతో వారంతా కొత్త విధానానికి మచ్చ తెచ్చిపెట్టి, ప్రజల్లో అనుమానాలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నా రు. నాణ్యమైన బియ్యాన్ని నాసిరకంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, తడిచిన బియ్యాన్ని చూపించి గడ్డ కట్టేస్తున్నాయని లీకులు ఇవ్వ డం, వండితే ముద్దయిపోతుందని ప్రచారం, వలంటీర్లను సైతం బెదిరించడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై ఫిర్యాదులు కూడా వచ్చాయి.

ఎలాగైనా ప్రభుత్వం కొత్త విధానం నుంచి వెనక్కి తగ్గి పాత పద్ధతిలో తమకు దోచుకునే అవకాశం కల్పిస్తుందనే ఎత్తుగడతో దుష్ట పన్నాగానికి దిగారు. ఇం టింటికి రేషన్‌ పంపిణీ ప్రారంభం కావడమే తరువాయి వీరి దుష్ప్రచారం మొదలైంది. క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల ద్వారా అనుమానాలు, అపోహాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఇదంతా అధికారుల దృష్టికి వచ్చింది. ఈ రకంగా చేసిందెవరో ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కాగా వివరాలు సేకరించాక కఠిన చర్యలు తీసుకునే యోచనలో అధికారులు ఉన్నారు.

డీలర్లు వారి ఉచ్చులో పడొద్దు
జిల్లా వ్యాప్తంగా 2015రేషన్‌ డిపో డీలర్లు ఉన్నారు. వారిలో పచ్చ పార్టీకి చెందిన వారు 700వరకు ఉన్నారు. నాణ్యమైన దుష్ప్రచా రానికి దిగుతున్నది దాదాపు వీరే. అయితే, మిగతా డీలర్లు వీరి ఉచ్చులో పడితే అసలుకే ఎసరొస్తుంది. టీడీపీ సానుభూతేతర డీలర్లంతా జాగ్రత్తగా ఉండాలి. టీడీపీ డీలర్లను ప్రోత్సహిస్తే ఇబ్బంది పడటం తప్ప ప్రయోజనం ఉండదు. కొత్త విధానం వల్ల డీలర్ల వ్యవస్థకు నష్టమేమీ ఉండదు. ఎప్పటిలాగే ఇన్సెం టివ్‌ వస్తుంది. వారి భద్రతకు డోకా ఉండదు. కానీ టీడీపీ డీలర్ల ట్రాప్‌లో పడితే నష్టపోయే అవకాశం ఉంది.

తప్పు చేస్తే చర్యలు తప్పవు
డీలర్ల భద్రతకు డోకా లేదని పౌరసరఫరాల మంత్రి కొడాలి నాని ఇప్పటికే చెప్పారు. ఎప్పటిలాగే కొనసాగుతారు. ఇన్సెంటివ్‌ కూడా తగ్గదు. ఇంకా చెప్పాలంటే గతంలో 15రోజులు కష్టపడాల్సి ఉండగా ఇప్పుడు రెండు రోజులతో పని పూర్తవుతుంది. కాకపోతే, గతంలో మాదిరిగా రీసైక్లింగ్‌కు అవకాశం ఉండదు.  ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే చెప్పుకోవాలి. అంతే తప్ప నాణ్యమైన బియ్యంపై తప్పుడు విధానాలకు పోతే చర్యలు తప్పవు. 
– కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు