అవేవీ అడగొద్దు..ఇచ్చింది తీసుకోండి!

5 Jun, 2018 13:16 IST|Sakshi
సత్తెనపల్లిలోని చౌకదుకాణంలో సరుకులు అందిస్తున్న డీలర్‌

బియ్యం పంపిణీకే పరిమితమైన రేషన్‌షాపులు

మిగతా సరుకులేవీ అడగొద్దంటున్న డీలర్లు

నిర్వీర్యమైన ప్రజా పంపిణీ వ్యవస్థ

సత్తెనపల్లి: మార్కెట్‌లో పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పేదలకు చౌకధరలకు నిత్యావసర సరుకులు అందించాల్సిన ప్రభుత్వం రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. రూ.185కే తొమ్మిది రకాల సరుకులు అందజేస్తామంటూ గతంలో ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటే మరిచింది. పైగా చౌక దుకాణాలను విలేజ్‌ మాల్స్‌గా మార్చుతామంటూ గొప్పలకు పోతోంది. దీంతో పేదలు పూట గడవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాలుగేళ్లుగా చౌక దుకాణాలు కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నుంచి చౌక దుకాణాల ద్వారా నిరుపేదలకు తొమ్మిది రకాల సరుకులు అందుతుండేవి. టీడీపీ అధికారంలోకి రాగానే కిరోసిన్, పంచదార, కందిపప్పు, పామాయిల్, ఉప్పు, గోధుమపిండి తదితర సరుకులన్నీ పంపిణీ నిలిచిపోయింది. జిల్లాలో మొత్తం 2,775, చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో అన్నపూర్ణ కార్డులు 1,077, అంత్యోదయ కార్డులు 74,594, తెల్లకార్డులు 13,79,094 ఉన్నాయి. తెల్ల కార్డుల వారికి ఒక్కక్క కుటుంబ సభ్యుడికి ఐదు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు.

9 వస్తువులకు స్వస్తి
అమ్మ హస్తం పేరుతో గతంలో రూ.185లకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను ప్రభుత్వం ప్రతినెలా చౌకదుకాణాల ద్వారా  పంపిణీ చేసింది. కిలో కందిపప్పు, లీటర్‌ పామాయిల్, కిలో గోధుమపిండి, కిలో గోధుములు, అరకిలో పంచదార, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, 250 గ్రాములు కారం, 100 గ్రాములు పసుపు ఇచ్చేవారు. ప్రసుత్తం మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.65, లీటర్‌ పామాయిల్‌ రూ.78, కిలో గోధుమపిండి రూ.45, కిలో గోధుములు రూ.35, అరకిలో పంచదార రూ.17, కిలో ఉప్పు రూ.14, అరకిలో చింతపండు రూ.90, కారం 250 గ్రాములు రూ.40, పసుపు 100 గ్రాములు రూ.17గా ఉన్నాయి. తొమ్మిది రకాల సరుకులు ప్రస్తుత మార్కెట్‌లో రూ.401 పలుకుతున్నాయి. అయితే ఇవన్నీ చౌకదుకాణంలో రూ.185లకే దక్కేవి.

భగ్గుమంటున్న ధరలు
చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులన్నీ ఇచ్చేటప్పుడు పేదలకు ఊరట ఉండేది. ప్రసుత్తం ప్రభుత్వం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుండటంతో మిగిలిన సరుకులను కార్డు దారులు బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కిరోసిన్, గోధుమపిండి, చక్కెర, పామాయిల్‌ పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడడంతో కార్డుదారులపై అదనపు భారం పడింది. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలు ఆకలి తీర్చేందుకు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చౌకదుకాణాల ద్వారా అన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు.

ఈ–పాస్‌తో ఇక్కట్లు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్‌ దుకాణాల్లో ఈ–పాస్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు, సిమెంట్‌ పనులు చేసుకునే వారి చేతి వేలిముద్రలు అరిగి పోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. చౌక దుకాణాల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి తీరా తమ వంతు వచ్చాక ఈ–పాస్‌ యంత్రాలు సిగ్నల్‌ అందకపోవడం, వేలిముద్రలు పడక పోవడంతో మళ్లీ, మళ్లీ వెళ్లాల్సి రేషన్‌ షాపులకు వెళ్లాల్సి వస్తోందని, ఫలితంగా కూలి పనులకు వెళ్లలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మార్కెట్లో కొనలేకపోతున్నాం
మార్కెట్లో ఏ సరుకులు కొనాలన్నా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చౌకదుకాణాల్లో బియ్యం మాత్రమే అందించడం వల్లన మిగిలిన సరుకులు కొనుగోలుకు ఇబ్బందిగా ఉంది. భవిష్యత్తులో ఆ బియ్యం పంపిణీ కూడా ఎక్కడ ఆపేస్తారేమోననే అనుమానం వెంటాడుతోంది.–జెట్టి కమల, మహిళ, నందిగామ

మరిన్ని వార్తలు