అయినా.. చర్యలేవీ..?

27 Aug, 2014 02:48 IST|Sakshi
అయినా.. చర్యలేవీ..?

 సాక్షి, కాకినాడ  :జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్‌షిప్‌ల భర్తీ కోసం జూన్ 29, 30 తేదీల్లో నిర్వహించిన రాత, మౌఖిక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై గత నెలలో నాలుగు రోజుల పాటు డివిజన్ల వారీగా జేసీ ఆర్.ముత్యాలరాజు విచారణ జరిపారు. ఈ నియామకాల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగినట్టు నిగ్గుతేల్చారు. జేసీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాతపరీక్షలో ఎక్కువ మార్కులొచ్చిన వారికి ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులొచ్చినట్టుగా చూపించి పక్కన పెట్టేశారు. తక్కువ మార్కులొచ్చిన వారికి ఎక్కువ మార్కులు వేసి దొడ్డిదారిన ఎంపిక చేశారు.
 
 ఎగ్జామ్ హాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించడంతో పాటు కొందరు అభ్యర్థుల స్థానే వేరే వారిని రాత పరీక్షకు అనుమతించినట్టుగా గుర్తించారు. కనీస మార్కులు కూడా రాని వారికి, 18 ఏళ్లు కూడా నిండని వారికి, కనీస విద్యార్హత పదో తరగతిసర్టిఫికెట్లు సమర్పించని వారికి, అసలు ఎలాంటి విద్యార్హతలు లేనివారికిసైతం డీలర్‌షిప్‌లు కట్టబెట్టినట్టు జేసీ విచారణలో వెలుగుచూశాయి. చాలా ఆన్సర్ షీట్లలో కొన్ని జవాబులకు ఓ రంగు, మరికొన్ని జవాబులకు మరో రంగు పెన్నులను వాడినట్టు గుర్తించారు. రిజర్వ్‌డ్ స్థానాల్లో సైతం ఓసీ అభ్యర్థులకు డీలర్‌షిప్‌లను కట్టబెట్టినట్టుగా తేల్చారు. ఉదాహరణకు కాకినాడ అర్బన్‌లో షాపు నం.126 కోసం పరీక్ష రాసిన నిమ్మగడ్డ బాలాత్రిపురసుందరికి రాతపరీక్షలో 30 మార్కులొస్తే..
 
 తుది జాబితాలో 60 మార్కులు వేసి ఎంపిక చేశారు. 2014 నవంబర్‌తో 18 ఏళ్లు నిండుతున్న భువన స్వాతికి రాజమండ్రి అర్బన్ షాపు నం.112ను కట్టబెట్టారు. సీతానగరంలో షాపు నం.51ను కట్టబెట్టిన గెడ్డం జయకుమార్ 8వ తరగతి చదివినట్టు చెబుతున్నప్పటికీ, ఎలాంటి విద్యార్హత పత్రాలు సమర్పించలేదు. స్థానికేతరుడైన మంచిగంటి శివాజీకి కాకినాడ అర్బన్ షాపు నం.60ను కట్టబెట్టినట్టుగా గుర్తించారు. ఇలా చెప్పుకొంటూ పోతే లెక్కలేనన్ని అక్రమాలు జేసీ విచారణలో బయటపడ్డాయి. దీంతో కాకినాడ రాజమండ్రి, పెద్దాపురం డివిజన్లలో పరీక్షలను రద్దు చేస్తున్నట్టు విచారణ అనంతరం జేసీ ప్రకటించారు.
 
 బాధ్యులపై చర్యల్లేవు
 ఈ వ్యవహారం రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశం కావడంతో జిల్లావ్యాప్తంగా జరిగిన డీలర్‌షిప్‌ల నియామకాలను నిలిపివేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు జారీ చేశారు. జేసీ తన విచారణ నివేదికను గత నెల 8నకలెక్టర్‌కు సమర్పించారు. ఇది జరిగి 50 రోజులైనా బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్ల మేరకే కలెక్టర్ ఈ నివేదికను తొక్కిపెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టుగా చెబుతున్నప్పటికీ, ఏ ఒక్కరిపై ఇప్పటివరకు ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు.
 
 ఒక్కొక్క షాపునకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల చొప్పున తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు అక్షరాలా రూ.అరకోటికి పైగా అధికారులు దండుకున్నట్టుగా ఆరోపణలు వినిపించాయి. ఇంత పెద్దఎత్తున అవినీతి జరిగినా.. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాత పద్ధతిలో తమ అనుచరులకు ఈ డీలర్‌షిప్‌లు కట్టబెట్టేందుకు కొందరు ‘దేశం’ నేతలు చాపకింద నీరులా రాష్ర్ట స్థాయిలో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం.
 

మరిన్ని వార్తలు