రేషన్ డిపోల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు

6 Jun, 2014 02:46 IST|Sakshi
రేషన్ డిపోల్లో జేసీ ఆకస్మిక తనిఖీలు

 శ్రీకాకుళం రూరల్/సరుబుజ్జిలి, న్యూస్‌లైన్: రేషన్ డిపోల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ వీరపాండ్యన్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని డీసీఎంఎస్ పాయింట్(డిపో నంబరు-52), ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని పలు డిపోలను తనిఖీ చేశారు. డీసీఎంఎస్ పాయింట్ డిపోలో సుమారు 20 నిమిషాలు పాటు రికార్డులు, స్టాక్‌ను సరిచూశారు. గ్రాండ్ స్టాక్ బ్యాలెన్సును పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతీ రేషన్ డిపోలో కచ్చితంగా ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలను వినియోగించాలని డీలర్లను ఆదేశించారు. మరోసారి తనిఖీకి వచ్చే సమయానికి ఎలక్ట్రానిక్ తూనికల యంత్రాలు లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ ప్రాం తాల్లోని డిపోల్లో ప్రభుత్వం నియమించిన డీలర్లు కాకుండా అనాధికార వ్యక్తులు డీలర్‌గా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా ఎక్కడైనా ఉంటే వాటిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రేషన్ డిపోల డీలర్లు స్టాక్, సేల్స్ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పై నిబంధనలు తక్షణమే అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని డీఎస్‌వో ఆనందకుమార్‌ను ఆదేశించారు.  
 
 తరుగు వస్తే సహించేదిలేదు
 చౌకధరల డీలర్లకు సరఫరా చేసే సరకుల్లో తరుగు వస్తే సహించేదిలేదని జేసీ హెచ్చరించారు. పౌరసరఫరాల గొడౌన్‌తోపాటు, పలు రేషన్ డిపోలపై ఫిర్యాదులు రావడంతో సరుబుజ్జిలి మండలంలోని గొడౌన్‌తోపాటు మర్రిపాడు రేషన్ డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మర్రిపాడు డిపోలో సరకుల వివరాలు, ధరలు, స్టాకుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.  అలాగే మండల పౌరసరఫరాల గొడౌన్‌లో సరకులు నిల్వచేసే పద్ధతులను, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. డిపోలకు సరఫరా చేసే సరకుల్లో తరుగులు వస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, సరిదిద్దుకోకపోతే చర్యలు తప్పవని గొడౌన్ ఇన్‌చార్జిపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో పౌరసరఫరాల జిల్లా మేనే జర్ లోక్‌మోహన్, తహశీల్డార్లు పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు