పక్కదారి పడుతున్న రేషన్ కిరోసిన్

29 May, 2014 03:44 IST|Sakshi
పక్కదారి పడుతున్న రేషన్ కిరోసిన్

వీరఘట్టం, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు రేషన్ డిపోల ద్వారా రాయితీపై అందించాల్సిన నీలి కిరోసిన్ పక్కదారి పడుతోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిరోసిన్‌ను డీలర్లు కొద్దిమంది లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేసి, మిగిలిన దాన్ని నల్లబజారుకు తరలించేస్తున్నారు. ముం దుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు స్టాకు రాగానే అక్రమ వ్యాపారులతో లాలూచీ పడుతున్నారు.

కిరోసిన్ అందని లబ్ధిదారులు దీనిపై ప్రశ్నిస్తే లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. సకాలంలో వచ్చి తీసుకోకపోతే తామేం చేస్తామంటూ తిరగబడుతున్నారు. అంతేకాకుండా రెండు నెలలకు ఒకసారి మాత్రమే కిరోసిన్ ఇస్తామని ఖరాఖండీగా చెబుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదు.

వేసవి, విద్యుత్ కోతలతో పెరిగిన డిమాండ్
అసలే వేసవి కాలం.. పైగా వేళాపాళా లేని విద్యుత్ కోతల కారణంగా కిరోసిన్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామీణులు చాలామంది కిరోసిన్ దీపాలపైనే ఆధారపడుతున్నారు. కొందరు వంట కోసం కూడా కిరోసిన్‌నే వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితి అటు రేషన్ డీలర్లకు, ఇటు అక్రమ వ్యాపారులకు వరంగా మారింది. కిరోసిన్ లోడ్ వ స్తోందని తెలిసిన వెంటనే అక్రమ వ్యాపారులు డీలర్ల వద్ద వాలిపోతున్నారు.

జిల్లాలో పరిస్థితి
జిల్లాలో మొత్తం 1987 రేషన్ డిపోలు ఉన్నా యి. వీటి పరిధిలో మొత్తం 7,77,875 మంది రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 6,81,940 తెలుపు రేషన్‌కార్డులు కాగా, రచ్చబండ-2లో ఇచ్చిన కార్డులు 41,892, ఏఏవై కార్డులు 52,722, ఏపీ కార్డులు 1321 ఉన్నాయి. వీరి కోసం ప్రతి నెలా 1,320 కిలోలీటర్ల కిరోసిన్ విడుదల చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన కార్డుదారునికి నెలకు 2 లీటర్ల చొప్పున కిరోసిన్ అందజేయాలి. అయితే డీలర్లు అలా ఇవ్వటం లేదు. కొందరు డీలర్లు లీటరు చొప్పున, మరికొందరు లీటరున్నర చొప్పున ఇస్తున్నారు. ఇదేంటని కార్డుదారులు ప్రశ్నిస్తే ఇంతే వచ్చింది ఏంచేయమంటారని దబాయిస్తున్నారు.

కొరవడిన పర్యవేక్షణ
పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ సరుకులను డీలర్లకు చేర్చేందుకు రూట్ అధికారులను నియమించారు. వీరితో డీలర్లు అవగాహన కుదుర్చుకుని కిరోసిన్‌నురాత్రి వేళ తరలిస్త్తున్నారు. దీంతో కిరోసిన్ తరలింపుపై ఎలాంటి పర్యవేక్షణ ఉండటం లేదు. మరో వైపు రేషన్ డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసినపుడు కిరోసిన్ కూడా అందుకున్నట్టు సంతకాలు చేయించుకుని జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు ఈ అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫిర్యాదులు వస్తే చర్యలు: డీఎస్‌వో ఆనందకుమార్
కిరోసిన్ అక్రమ తరలింపుపై జిల్లా పౌరసరఫరాల అధికారి ఆనందకుమార్‌ను న్యూస్‌లైన్ ప్రశ్నించగా కిరోసిన్ పంపిణీపై ఇప్పటి వరకు తమకెలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. ఫిర్యాదులేమైనా వస్తే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కిరోసిన్ సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు