కటాఫ్ డేట్‌తో సరుకుల కోత

18 Jun, 2015 03:45 IST|Sakshi

♦ సరఫరా చేసింది 68 శాతమే
♦ 5శాతం మందికి వేలిముద్రల నిరాకరణ
♦ స్వయం సహాయక సంఘం సభ్యులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
♦ నేటితో రేషన్ పంపిణీ బంద్
 
 కర్నూలు : పౌర సరఫరా శాఖలో కొత్తగా తెచ్చిన బయోమెట్రిక్ విధానం కార్డుదారులకు ఓ పరీక్షగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకుల పంపిణీ సమస్యగా మారిన నేపథ్యంలో రేషన్ పంపిణీకి కటాఫ్ తేదీ నిర్ణయించి కార్డుదారులకు ప్రభుత్వం శఠగోపం పెడుతోంది. గత నెల 15వ తేదీని రేషన్ సరఫరాకు కటాఫ్‌గా నిర్ణయించి 35 శాతం మందికి సరుకులు ఎగ్గొట్టింది. జూన్‌లో కూడా 18వ తేదీతో రేషన్ పంపిణీ నిలిపివేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ-పాస్ అమలవుతున్న కర్నూలు కార్పొరేషన్‌తో పాటు 9 మున్సిపాల్టీల పరిధిలో 458 చౌక డిపోలు,  2,61,487 కార్డుదారులున్నారు.

అందులో 1,78,123 మంది కార్డుదారులకు మాత్రమే(68 శాతం) సరుకులు సరఫరా చేశారు. మిగిలిన 83,364(32 శాతం) మందిలో చౌక డిపోకు వచ్చి ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసినప్పటికీ వివిధ కారణాల చేత 13,468 మందికి(5 శాతం) సరుకులు అందలేదు. ఒక్కొక్క చౌక డిపోకు ఇద్దరు స్వయం సహాయక సభ్యులతో వారికి సరుకులు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జేసీ హరికిరణ్ వెల్లడించారు. 69,892 మంది కార్డుదారులు(27 శాతం) సరుకుల కోసం రెండు నెలలుగా రావడం లేదని అధికారులు తేల్చారు. వారు అసలైన లబ్దిదారులా లేక బోగస్ కార్డులా అనే విషయంపై అధికారులు పరిశీలిస్తున్నారు.

 పనిచేయని సర్వర్: ఈ-పాస్ విధానంలో సర్వర్ సరిగా పనిచేయక రేషన్ అందడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మే నెలలో సర్వర్ సక్రమంగా పనిచేయక రేష న్ పంపిణీ సక్రమంగా జరగలేదు. 66.57 శాతం మంది లబ్దిదారులు మాత్రమే ఈ-పాస్ మిషన్ల ద్వారా సరుకు లు తీసుకున్నారు. 87,320 మంది కార్డుదారులు వివిధ కారణాలతో మే నెల కోటా సరుకులు తీసుకోకుండానే అధికారులు క్లోజింగ్ బ్యాలెన్స్ చూపించారు. సరుకుల కోసం కార్డుదారులు చౌక డిపోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే అధికారులు ఈ-పాస్ విధానం వల్ల రేషన్ మిగిలిందని ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నారు.

 ఐదు శాతం మంది వేలిముద్రల నిరాకరణ: చౌక దుకాణాల్లో వీకర్‌సెక్షన్ కాలనీలకు చెందిన ప్రజలే సరుకులు పొందలేకపోతున్నారు. పనులకు వెళ్తున్న వీరి వేలిముద్రలు ఈ-పాస్ మిషన్ నిరాకరిస్తుండటంతో సమస్యగా మారింది. జూన్ కు సంబంధించి 13,468 కార్డుదారుల వేలిముద్రలను ఈ-పాస్ మిషన్లు నిరాకరించడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అయితే అందుకు 20వ తేదీ వరకు మాత్రమే గడువు విధించడం సరికాదని కార్డుదారులు వాపోతున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా