ఎక్కడ నుంచైనా రేషన్‌..వలసదారులకు వరం!

13 Aug, 2019 05:20 IST|Sakshi

ప్రతినెలా 30 లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి

పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు 

సెప్టెంబర్‌ నుంచి నేరుగా ఇంటికే సరఫరా

ఏపీలో కార్డుదారులకు ప్రయోగాత్మకంగా తెలంగాణలోనూ అందజేత

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేషన్‌ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుండి లక్షలాది మంది వలస వెళ్తున్నారు. ఇలాంటి వారికి కూడా ఆయా రాష్ట్రాల్లోనే సబ్సిడీ సరుకులు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో తెల్లరేషన్‌ కార్డులు కల్గి ఉండి తెలంగాణలో ఉంటున్న వారు ఈ–పాస్‌ ద్వారా సరుకులు తీసుకునే విధానాన్ని ఇటీవల ప్రయోగాత్మకంగా అమలుచేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రేషన్‌ తీసుకునే విధానం విజయవంతమైతే ఈ విధానాన్ని దేశమంతటా అమలుచేయనున్నారు. కాగా, ఏపీలోనే పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ తీసుకుంటున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలైతే రాష్ట్రానికి చెందిన మరికొందరికి లబ్ధి చేకూరుతుంది. ఈ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 

వచ్చే నెల నుంచి ఇంటికే రేషన్‌
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్‌ నుంచి ప్రజా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా.. 5, 10, 20 కిలోల బ్యాగుల ద్వారా బియ్యాన్ని లబ్ధిదారుల ఇళ్లకే గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. నూతన విధానం అమల్లోకి వచ్చినా వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ డీలర్‌ (స్టాకు పాయింట్లు) వద్దే సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఆ మేరకు ఈ–పాస్‌ మిషన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేశారు. దీని ద్వారా ఎక్కడ, ఏ రేషన్‌ దుకాణంలో ఎంతమంది లబ్ధిదారులు సరుకులు తీసుకెళ్లారో ఆన్‌లైన్లో నమోదవుతుంది. కాగా, ఏదేని రేషన్‌ షాపులో 50 శాతం సరుకు పూర్తికాగానే సంబంధిత జిల్లా డీఎస్‌ఓలను అప్రమత్తం చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి మెసేజ్‌ వెళ్తుంది. తద్వారా సంబంధిత షాపులకు అదనంగా కోటాను అందుబాటులోకి తెస్తారు. 

మరిన్ని వార్తలు