200 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

20 Jul, 2014 04:14 IST|Sakshi

మదనపల్లె క్రైం: రెండు లక్షల రూపాయల విలువ చేసే 200 బస్తాల రేషన్ బియాన్ని మదనపల్లె పోలీసులు శని వారం పట్టుకున్నారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి మదనపల్లె వరకు చేరాయంటే చెక్‌పోస్టుల్లో తనిఖీల వ్యవస్థ ఎలా ఉందో ఇట్టే తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు మదనపల్లె పోలీసులు వలపన్ని బియ్యంతోపాటు ఓ లారీని, కారును స్వాధీ నం చేసుకున్నారు. రూరల్ ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కథనం మేరకు..
 
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన రేషన్ డీలర్ చంద్రశేఖర్‌నాయుడు పేదల కడుపుకొట్టాడు. 200 బస్తాల బియ్యాన్ని సేకరించాడు. ఈ బియ్యాన్ని సన్నాలుగా మార్చి కర్ణాటకకు తరలిం చేందుకు ఐషర్ వాహనంలో లోడ్ చేశాడు. ఇండికా కారులో నెమలికిరణ్(27) పెలైట్‌గా ముందు వెళ్తూ చెక్‌పోస్టుల్లో మామూళ్లు ముట్టచెబుతూ వస్తున్నాడు.

రేషన్ బియ్యం తరలిస్తున్న లారీలో నాయుడుపేటకు చెందిన చిన్న(24), దేవరాజ్ ఓంప్రకాష్(52), బాలాజీ (52) ఉన్నారు. పేదల బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మదనపల్లె రూరల్ సీఐ చంద్రశేఖర్‌కు అందడంతో ఎస్‌ఐ, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి కొత్తబైపాస్ రోడ్డులో నిఘా పెట్టాడు.

నిమ్మనపల్లె రోడ్డు కొత్త బైపాస్‌లో ముందు కారు, వెనుక లారీ వస్తుండటాన్ని గమనించి పట్టుకున్నారు. తనిఖీలు చేయగా లారీలో 200 బస్తాలు (పది వేల కేజీలు) రేషన్ బియ్యం పట్టుబడింది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లారీతోపాటు బియ్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ బియ్యాన్ని కోర్టులో సబ్‌మిట్ చేసిన తర్వాత సివిల్ సప్లై వారికి తరలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.
 

మరిన్ని వార్తలు