బయటపడిన బియ్యం బాగోతం

6 Sep, 2019 08:23 IST|Sakshi

‍సాక్షి, లక్కిరెడ్డిపల్లె(కడప) : చౌక బియ్యంలో కొందరు వ్యక్తులు చేస్తున్న దోపీడీని సాక్షి బహిర్గం చేసింది. లక్కిరెడ్డిపల్లె..రామాపురం..గాలివీడు మండలాల్లోని స్కూళ్ల వసతి గృహాలకు లక్కిరెడ్డిపల్లె బియ్యం గోడౌన్‌ నుంచి ప్రభుత్వ సబ్‌ కాంట్రాక్టర్‌ నిత్యావసర సరుకులను తరలిస్తుంటారు..చిన్నమండ్యెంకు చెందిన గోడౌన్‌ స్టాకిస్టు వంశీకృష్ణ ఇక్కడి గోడౌన్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులను నియమించుకొని గుట్టుచప్పుడు కాకుండా ఆయన దళారులను అడ్డుపెట్టుకొని బియ్యం దందా సాగిస్తున్నారని తెలిసింది. దీనిపై సాక్షి నిఘా పెట్టింది.   ప్రతి నెలా దాదాపు 200 క్వింటాళ్లు పైబడే బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నట్లు సమాచారం.

సబ్‌ కాంట్రాక్టర్‌కు హమాలీలు కూడా తోడవుతున్నట్లు భోగట్టా. తూకాలు వేసి ఇవ్వాలని చాలా మంది డీలర్లు అడుగుతున్నా పట్టించుకోకపోవడంలేదు. దీంతో బస్తాకు 3 నుంచి 5 కేజీలు తరుగు వస్తోందని డీలర్లు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు గానీ  సిబ్బంది గాని పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా చౌకదుకాణాలతో పాటు వసతి గృహాలకు బియ్యం తరలింపు ప్రక్రియ చేపడుతూ మధ్య మధ్యలో కొంత బియ్యాన్ని బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 182 బస్తాల చౌక బియ్యాన్ని ఇదే విధంగాబ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందకు ప్రయత్నం చేశారు.  బియ్యంలోడున్న వాహనం రాయచోటికి బయలుదేరినట్లు సాక్షికి సమాచారం అందింది.

టెంపో వాహనాన్ని రాయచోటి మాసాపేట వద్ద సాక్షి విలేకరి అడ్డుకున్నారు. చిత్తూరు వెళుతున్నట్లు వాహన డ్రైవరు తెలిపారు. బియ్యం లోడ్‌పై పట్టను తొలగించగాగా 182 బస్తాల బియ్యం కనిపించాయి. వెంటనే డ్రైవర్‌ తప్పించుకునే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే అక్కడున్న కొందరు మీడియాను వెంబడించి ద్విచక్రవాహనం తాళాలు,సెల్‌ ఫోన్‌లు లాక్కుని బెదిరించారు. ఈలోగా బియ్యం వాహనం ముందుకు వేగంగా కదిలిపోయింది.

విషయం తెలుసుకున్న ఆర్డీఓ  వెంటనే లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌ను తనిఖీ చేశారు. ఆ సమయానికి అక్కడ సిబ్బంది,సబ్‌ కాంట్రాక్టర్‌ లేరు. రికార్డులు కూడా అందుబాటులో లేవు. కడప ఆర్డీఓ మలోలాను సాక్షి సంప్రదించగా అక్రమంగా తరలిపోయిన 182 బస్తాల చౌకబియ్యం లక్కిరెడ్డిపల్లె గౌడౌన్‌కు చెందినవేనని స్పష్టం చేవారు. సీసీ పుటేజీ ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించామన్నారు. సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు.  

మరిన్ని వార్తలు