పేదల బియ్యం.. పెద్దల భోజ్యం

20 Jul, 2014 00:54 IST|Sakshi

భారీగా తరలిపోతున్న రేషన్ బియ్యం
రూ. కోట్లు దండుకుంటున్న దళారులు
కర్నూలు కేంద్రంగా పాలిషింగ్ వ్యాపారం
నిద్రపోతున్న నిఘా.. మొక్కుబడిగా కేసులు

 
కల్లూరులో ఓ గోదాములో అక్రమంగా ఉంచిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.సీ క్యాంపు సెంటర్‌లో ఆటోలో అక్రమంగా తరలుతున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం అధికారులు సీజ్ చేశారు.
 
పేదల బియ్యం అక్రమంగా తరలిపోతుందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలుతున్న వాటినే అధికారులు ఎక్కవగా స్వాధీనం చేసుకుంటున్నారు. లారీల్లో తరలిపోతున్న బియ్యంను పట్టించుకోవడంలేదు. రేషన్ బియ్యాన్ని పాలిషింగ్ చేసి సన్న బియ్యంగా మార్చి అమ్ముతున్నారు.
 
కర్నూలులో యథేచ్ఛగా సాగుతున్న పాలిషింగ్ వ్యాపారాన్ని అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 11.54 లక్షల తెల్లకార్డుదారులకు 11.5 వేల మెట్రిక్ టన్నులకుపైగా రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఇందులో సగానికి పైగా అడ్డదారిలో తరలిపోతోంది. రూపు మార్చుకుని మళ్లీ ఎక్కువ ధరతో వినియోగదారులకు చేరుతోంది.      - సాక్షి, కర్నూలు
 
సాక్షి, కర్నూలు: రూపాయికి కిలో బియ్యం.. జిల్లాలో చాలా మంది పేదల ఆకలి తీరుస్తోంది. నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్న నేపథ్యంలో ఈ బియ్యమే కొంత ఊరటనిస్తున్నాయి. అయితే కొందరు అక్రమార్కులు పేదల నోటికాడి కూడును బలవంతంగా లాక్కెళ్తున్నారు. తక్కువ ధరతో కొని వాటినే పాలిష్ చేసి కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల్లో బియ్యం అందక.. బయట అధిక ధరలకు కొనలేక చాలా మంది పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. జిల్లాలో ఈ తంతు ఎక్కువగా కర్నూలు, నందికొట్కూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాల్లో సాగుతోంది. కర్నూలులో రేషన్ బియ్యం మాఫియా జడలు విప్పింది.
 
కర్నూలు శివారు ప్రాంతాల్లో ఉన్న మిల్లుల్లో చాలా వరకు పాలిష్ వ్యాపారం జోరుగా సాగుతోంది. స్థానిక ప్రాంతాలే కాకుండా అనంతపురం, గుంతకల్లు, గుత్తి వంటి ప్రాంతాల నుంచి కూడా సమీపంలోని మిల్లులకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. రేషన్‌కార్డుదారులు నుంచి కొనడంతోపాటు ఇటీవల కొందరు డీలర్ల నుంచే నేరుగా వస్తున్నాయి. జిల్లాలోని మిల్లులకు, ఇతర జిల్లాలకు తరలిస్తూ కిలో రూపాయి ఉన్న బియ్యాన్ని రూ. 23 వరకు మార్చుతున్నారు. మిల్లుల్లో ఇవి సన్న బియ్యంగా మారుతున్నాయి. చివరికి వీటిని పోర్టులకు తరలించి అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
మిల్లుల్లో ప్రత్యేక మిషన్లు
మిల్లులో పాలిష్ చేసే విధానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తున్నారు. పాలిషనర్ మీదనే ఆడించి సన్న బియ్యంగా మార్చుతున్నారు. రంగుమారి తెల్లగా కనిపించేలా పాలిష్ పడుతున్నారు. ఎక్కువ శాతం మిల్లుల్లో దీని కోసం ప్రత్యేకంగా మిల్‌టెక్ అనే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. రూ. లక్షలు వెచ్చించి ఇటువంటి యంత్రాలను కొంటున్నారు. వీటిపై పట్టించిన తర్వాత రేషన్ బియ్యానికి సన్న బియ్యానికి తేడా కనిపించదు. క్వింటా రేషన్ బియ్యంను ఆడిస్తే ఎనభై ఐదు కిలోల వరకు వస్తాయి. వీటిని నిజమైన సన్న బియ్యంలో 20 నుంచి 40 శాతం వరకు కలుపుతున్నారు. ఇలా వేల క్వింటాళ్ల రేషన్ బియ్యం పాలిష్ అయి వినియోగదారులకు చేరుతున్నాయి.
 
సగానికిపైగా పక్కదారి..
జిల్లా వ్యాప్తంగా 11.54 లక్షల తెల్లకార్డుదారులు ఉన్నారు. ప్రతి నెలా వీరికి 11.5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయాల్సి వస్తోంది. అయితే ఇందులో సగానికి పైగానే అడ్డదారిలో తరలుతున్నాయి. అధికారులు మామూళ్లు తీసుకుంటూ అక్రమాలను అరికట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
 
తూతూ మంత్రంగా కేసులు..
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తోన్న వారిపై చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. ఐదు క్వింటాళ్లు రవాణా చేసినా.. వందల క్వింటాళ్లు తరలిస్తూ పట్టుబడ్డప్పటికీ కేవలం 6ఏ కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు. 6ఏ కేసు అంటే రెవెన్యూ సంబంధమైంది. జేసీ దగ్గరికి వెళ్లి ఆ బియ్యం ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలి. కార్డుదారుల దగ్గర కొన్నానని చెప్పి బియ్యం వదిలించుకుని వస్తున్నారు. కానీ వీరిపై చట్టపరమైన చర్యలు ఉండటం లేదు. దీంతో అక్రమ రవాణాదారులు జంకు లేకుండా ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నారు.
 
ఇటీవల నందికొట్కూరులో 100 క్వింటాళ్లు రవాణా చేస్తూ పట్టుబడ్డ వ్యక్తిపై 6ఏ కేసు నమోదు చేశారు. వారం కిందట కల్లూరులో 30 క్వింటాళ్లతో పట్టుబడ్డ వారిపై కూడా 6ఏ కేసు నమోదు చేశారు. అయితే గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు అక్రమార్కులపై నమోదు చేసిన 6ఏ కేసులను వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. ఏడాదిలో సుమారు వెయ్యి క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసినా కేసుల నమోదు తక్కువగా ఉంది.

మరిన్ని వార్తలు