బియ్యం బొక్కుడు తూకం.. తకరారు 

13 Aug, 2019 09:57 IST|Sakshi
అనంతపురం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో లారీకి బియ్యం లోడ్‌ చేస్తున్న దృశ్యం

కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో చేతివాటం

క్వింటాకు 2 నుంచి 4 కిలోల మేర దోపిడీ 

నెలకు 50 టన్నుల బియ్యం నల్లబజారుకు 

నిరుపేదల బియ్యాన్ని కొందరు అడ్డదారిలో బొక్కుతున్నారు. కొన్ని మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్లలో (ఎంఎల్‌ఎస్‌) సిబ్బంది చేతివాటం చూపుతూ క్వింటాకు రెండు నుంచి నాలుగు కిలోలు దోచేస్తున్నారు. ఫలితంగా డీలర్లకు తక్కువ బియ్యం అందుతున్నాయి. దీంతో డీలర్లు కూడా తూకంలో తకరారు చేస్తూ కార్డుదారులకు తక్కువ బియ్యం ఇస్తున్నారు. ఇలా ఒక్క నెలలోనే దాదాపు 50 టన్నుల బియ్యాన్ని నొక్కేస్తూ నల్లబజారుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు ఎక్కడ తమను ఇబ్బందులకు గురి చేస్తారోనని డీలర్లు నోరు మెదపడం లేదు.

సాక్షి, అనంతపురం :  జిల్లాలో 3,003 చౌక ధరల దుకాణాలుండగా.. వాటి పరిధిలో 12,21,772 తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 24 ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్ల ఇండెంట్‌ మేరకు చౌక దుకాణాలకు బియ్యాన్ని రవాణా చేస్తారు. కార్డుదారులకు ప్రతి నెలా 18,500 టన్నులు బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సగటున 770 టన్నుల బియ్యం డీలర్లకు సరఫరా అవుతోంది. కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది బియ్యాన్ని నొక్కేస్తుండగా.. ఆ ప్రభావం కార్డుదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది.

నోరు మెదపలేని స్థితిలో డీలర్లు 
ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో క్వింటా మీద రెండు నుంచి నాలుగు కేజీల వరకు బియ్యం నొక్కేస్తున్నా.. డీలర్లు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇదేమని ప్రశ్నిస్తే సంబంధిత అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తారని కొందరు డీలర్లు వాపోతున్నారు. 200 క్వింటాళ్ల మేర బియ్యం ఇవ్వాల్సి ఉన్నా డీలర్‌కు 196 క్వింటాళ్లు మాత్రమే ఇస్తున్నారు. నాలుగు క్వింటాళ్లు(400 కేజీలు) తక్కువగా ఇస్తున్నారని, వాటి కోసం అధికారులతో గొడవ పడి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నామని పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలోని ఒక డీలర్‌ చెబుతున్నాడు. ఇలా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కోత పెట్టిన బియాన్ని కార్డుదారులకు పంపిణీ చేసే క్రమంలో సర్దుబాటు చేసుకుంటున్నామని సదరు డీలర్‌ చెబుతున్నాడు. ఇలా తాను ఒక్కడినే కాదని జిల్లాలో చాలా మంది డీలర్లు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పుకొచ్చాడు.

అధికారులది మరో వాదన 
ప్రస్తుతం టెయిర్‌ వెయిట్‌(సంచి తూకం) ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కో క్వింటా బియ్యాన్ని రెండు బస్తాల్లో నింపుతున్నారనీ, ఒక్కో బస్తా సంచి బరువు కిలో 100 గ్రాములు ఉంటుందన్నారు. సరఫరా అయ్యే బియ్యమే క్వింటా స్థానంలో 998.9 కేజీలు ఉంటోందన్నారు. ఇక స్టేజ్‌–1 ద్వారా ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వచ్చే బియ్యంలోనే క్వింటా మీద రెండు నుంచి మూడు కేజీల వరకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. ఈ తరుగు 120 టన్నుల మేర ఉంటోందంటున్నారు. ఎఫ్‌సీఐ, ఎస్‌డబ్ల్యూసీలో లోడింగ్, అన్‌లోడింగ్‌కు తరుగు ఇస్తున్నారని, అదే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అన్‌లోడింగ్, లోడింగ్‌కు తరుగును ఇవ్వడం లేదంటున్నారు. దీన్ని భర్తీ చేసుకునేందుకు డీలర్లకు కొందరు తక్కువగా ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. తరుగు అంశాన్ని గత ప్రభుత్వ హయాంలోనే కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

కొన్ని చోట్ల జరుగుతుండొచ్చు
బియ్యం తక్కువగా ఇవ్వడం లేదని చెప్పలేను. కానీ అన్నిచోట్ల కాదు. కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఇది జరుగుతుండొచ్చు. ముఖ్యంగా బియ్యం అన్‌లోడింగ్, లోడింగ్‌ క్రమంలో కొంత తరుగు వస్తున్న మాట వాస్తవమే. అలా అని డీలర్లకు బియ్యం తక్కువగా ఇవ్వకూడదు. పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేస్తాం. స్టేజ్‌–1 నుంచి బియ్యం తీసుకొచ్చే లారీని తూకం వేయిస్తాం. అదే విధంగా స్టేజ్‌–2 ద్వారా డీలర్లకు బియ్యం రవాణా చేసే లారీలను తూకం వేయిస్తాం. – డి.శివశంకర్‌రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ   

మరిన్ని వార్తలు