పిల్లల బియ్యం  మట్టిపాలు

23 Jun, 2019 08:30 IST|Sakshi
పాఠశాల ఆవరణలో పాడైపోయిన 22 బియ్యం బస్తాలు

పాడైన 22 బస్తాల రేషన్‌ బియ్యం

పట్టులుపట్టి, ముక్కిపోయిన వైనం

జేఆర్‌పురం హైస్కూలు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం

సాక్షి, రణస్థలం (శ్రీకాకుళం): నిత్యం లక్షలాది మంది ప్రజలు తిండికి నోచుకోక ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతోమంది పేదలు బక్కిచిక్కిపోతున్నారు. చిన్నారుల డొక్కలు తేలుతున్నాయి. ఇటువంటి ఎన్నో అంశాలు పాఠ్యాంశంగా బోధిస్తున్న ఉపాధ్యాయులే ఘోర తప్పిదం చేశారు. విద్యార్థులకు తిండి పెట్టాలని పంపించిన రేషన్‌ బియ్యాన్ని వృథా పాల్జేశారు. వీరి నిర్లక్ష్యం మూలంగా 22 బస్తాల బియ్యం ముక్కిపోయి పనికి రాకుండా పోయాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మండలంలోని జేఆర్‌పురం (రణస్థలం)లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎనిమిది వందలకుపైగా విద్యార్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. వీరందరికీగాను మధ్యాహ్న భోజనంగా పెట్టేందుకు మార్చిలో 22 బస్తాలు అంటే 11 క్వింటాళ్లు రేషన్‌ బియ్యం వచ్చాయి. పౌర సరఫరాల అధికారులు ఆయా పాఠశాలలు ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారమే రేషన్‌ బియ్యాన్ని పాఠశాలలకు పంపిస్తారు. జేఆర్‌పురం హైస్కూలు ఉపాధ్యాయులు మాత్రం ముందస్తు ఆలోచన లేకుండా రేషన్‌ బియ్యం వృథా చేశారు. మార్చి, ఏప్రిల్‌లో ఒంటిపూట బడుల నిమిత్తం ఎక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు ఆసక్తి చూపరు.

ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గుర్తించలేదు. దీంతో ఇటు విద్యార్థులు తినడం కుదరక, అటు తిరిగి పౌర సరఫరాల అధికారులకు అప్పగించక వదిలేయడంతో పట్టులుపట్టి, ముక్కిపోయి తినేందుకు పనికిరాకుండా పోయాయి. శనివారం ఇక్కడకు కొత్తగా రేషన్‌ బియ్యం రావడంతో మార్చిలో విడుదల చేసిన రేషన్‌ బియ్యం పాడవడంతో పాఠశాల ఆవరణలో వృథాగా పడేశారు. స్థానికులు కొంతమంది ఆ బియ్యాన్ని చూసి ఇంతలా  దుర్వినియోగం చేయడం దారుణమని చర్చించుకుంటున్నారు.

తిరిగి మార్చేస్తాం 
మార్చిలో బియ్యం విడుదల చేయించాం. విద్యార్థులు తినకపోవడంతో మిగిలిపోయా యి. తహసీల్దారుతో మాట్లాడి తిరిగి పంపించేస్తాం. అందులో జూనియర్‌ కళాశాలకు సంబంధించి బియ్యం ఆరున్నర క్వింటాళ్లు ఉన్నాయి. 
– జీ రాజాకిషోర్, హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్‌ రణస్థలం 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం 
బియ్యం వృథా జరగిందని ఎవరూ చెప్పలేదు. తక్కువ మోతాదు బియ్యం అయితే మార్చవచ్చు. 11 క్వింటాళ్లంటే ఉన్నతాధికారులకు తెలియజేయాలి. అయితే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– బీ రాజేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్, సివిల్‌ సప్లయి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా