హెల్ప్‌ మి

8 Apr, 2018 15:39 IST|Sakshi
రేషన్‌ దుకాణం

నామినీల స్థానంలో హెల్పర్లను నియమించాలని డీలర్ల అభ్యర్థన

ఒంటరివారికి భారంగా మారిన నిర్వహణ

ఆదాయం తక్కువ.. ఇబ్బందులు ఎక్కువ 

వారు ఒంటరివారు..రేషన్‌ డీలర్‌గా బతుకు బండి లాగుతున్నారు. సరుకుల పంపిణీ చేసేందుకు సహాయక   (హెల్పర్‌)ని ప్రభుత్వం నియమించకపోవడంతో కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీలో ఆపసోపాలు పడుతున్నారు. నామినీగా భార్యాభర్తలో ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించినా వచ్చే అంతంతమాత్రం ఆదాయానికి ఇద్దరు ఒకేచోట ఉండిపోతే పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  నామినీ బదులుగా హెల్పర్లను నియమించాలని  వేడుకొంటున్నారు. 

ఉయ్యూరులోని  0682020 నంబర్‌  రేషన్‌ దుకాణాన్ని ఒక మహిళా డీలర్‌ నిర్వహిస్తున్నారు. ఆమె ఒంటరిగా జీవిస్తున్నారు. బతుకుతెరువు కోసం రేషన్‌ డీలర్‌ గా ఉన్నారు. జీవిత భాగస్వామి లేకపోవడంతో నామినీని పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. హెల్పర్‌ను నియమించుకునే అవకాశం ఇవ్వమని కోరుతున్నా  స్పందనలేదు.

విజయవాడ సర్కిల్‌–2 కార్యాలయ పరిధిలో పి.వెంకటేశ్వరరావు( నంబర్‌ 0684263 ) రేషన్‌ డిపో నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య లేదు. ఒంటరిగా ఉండటంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం నామినీని నియమించుకునే అవకాశం లేదు. తాను ఒక్కడినే దుకాణం నడపుకోలేనని   హెల్పర్‌ కావాలని కోరినా స్పందన శూన్యం.

సాక్షి, విజయవాడ :  జీవనోపాధి కోసం రేషన్‌ దుకాణం నడిపే డీలర్ల మెడపై ప్రభుత్వం ఆంక్షల కత్తి పెడుతోంది. దీంతో డీలర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తలాతోక లేకుండా తీసుకున్న నిర్ణయాలు కొంతమంది డీలర్లకు శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగి జీవిస్తూ, రేషన్‌ దుకాణం నడుపుకునే డీలర్లకు నామినీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నామినీలకు బదులుగా హెల్పర్లకు అవకాశం ఇవ్వమని డీలర్లు ముక్తకంఠంతో కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వారికి చుక్కలు చూపిస్తోంది.  

నామినీలను తగ్గించడంతో ఇబ్బందులు 
రేషన్‌ దుకాణాన్ని ఒక డీలరే నడుపుకోలేరని గతంలో ఇద్దరు నామినీలను ఇచ్చేవారు. రేషన్‌ డీలర్‌ వేలిముద్రలతో పాటు మరో  ఇద్దరి వేలిముద్రలు ఈపోస్‌ మిషన్‌లో నమోదు చేసే వారు. డీలర్‌ దుకాణంలో లేని సమయంలో మిగిలిన ఇద్దరిలో ఎవరైనా సరుకులు ఇచ్చే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇద్దరు నామినీలను తీసి వేసి కేవలం భార్య లేదా భర్త మాత్రమే నామినీగా ఉండాలని వారే సరుకులు పంపిణీ చేయాలని నిబంధన విధించింది.  భర్త పేరుతో రేషన్‌ దుకాణం ఉంటే భార్య, భార్య పేరుతో ఉంటే భర్త  వేలిముద్రలు మాత్రమే ఈపోస్‌ మిషన్‌ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. భార్య, భర్త మినహా ఇతరుల వేలిముద్రలు నమోదు చేయడానికి వీలు లేదు. రెండో నామినీని తొలగించారు. 

కొండనాలుకకు మందేస్తే...
రేషన్‌ దుకాణాలు బినామీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని విమర్శలు రావడంతో బినామీలను అరికట్టేందుకు అధికారులు ఇద్దరు నామినీలను తొలగించి, జీవిత భాగస్వామిని మాత్రమే నామినీగా ఉంచారు. కొండనాలుకకు  మందేస్తే.. ఉన్ననాలిక ఊడినట్లు ఇప్పుడు ఈ నిబంధన కొంతమంది డీలర్లకు శాపంగా మారింది. జిల్లాలో 2,147 రేషన్‌ దుకాణాలు ఉండగా అందులో 73 దుకాణాల డీలర్లకు జీవిత భాగస్వాములు లేరు. ఇప్పుడు వారికి నామినీని పెట్టుకునే అవకాశం లేకపోయింది. దీంతో డీలర్లు నానా అవస్థలు పడుతున్నారు. 

డీలర్లకు కష్టాలు 
ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో బియ్యం తప్ప ఇతర సరుకులు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు కటుంబాలు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో జీవిత భాగస్వాములు కూడా  వేరే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారిని మాత్రమే నామినీగా నియమించడం వల్ల వాళ్లు మరో పనిచేసుకునే వీలులేకుండా పోయింది. 

హెల్పర్స్‌ను నియమించాలని మంత్రికి వినతి 
 చౌకధరల దుకాణదారుల సంఘం రాష్ట్ర నాయకులు  ఇటీవల పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును  కలిసి నామినీకి బదులుగా హెల్పర్స్‌ను నియమించుకునేందుకు అవకాశం కల్పించమని కోరారు. హెల్పర్‌కు వేతనం కాని, కమీషన్‌ కాని ప్రభుత్వం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కేవలం రేషన్‌ దుకాణం నిర్వహిస్తే ఆదాయం సరిపోక నామినీలు కూడా వేరొక పనిచేసుకుంటున్నారని వివరించారు. నామినీకి బదులుగా హెల్పర్‌ వేలిముద్రను ఈపోస్‌ మిషన్‌లో తీసుకోవాలని కోరుతున్నారు. అయితే దీనిపట్ల మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. 

హెల్పర్స్‌ను అనుమతించం
కమిషనర్‌ ఉత్తర్వుల ప్రకారం డీలర్లు కోరిన విధంగా హెల్పర్స్‌ని నియమించడం సాధ్యపడదు. అయితే జీవిత భాగస్వామి లేని పక్షంలో డీలర్‌ రేషన్‌కార్డులో ఉన్న వారిలో ఒకరిని నామినీగా నియమిస్తాం.  – డీఎస్‌వో నాగేశ్వరరావు

హెల్పర్‌ను నియమించండి
నామినీకి బదులుగా హెల్పర్‌ను ఇవ్వమని ఇప్పటికే మంత్రిని కలిసి విన్నవించాం. హెల్పర్‌ను ఇస్తే డీలర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. డీలర్ల కుటుంబ సభ్యులు మరో పని చేసుకునే అవకాశం ఉంటుంది. 
– కె.కొండ(జేమ్స్‌), రేషన్‌డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు