సకాలంలో తెరుచుకోని రేషన్‌ షాపులు 27 వేలు

22 Apr, 2018 03:13 IST|Sakshi

రేషన్‌ షాపుల పనితీరుపై ప్రభుత్వ సర్వే

రాష్ట్రంలో ఉన్న రేషన్‌ షాపులు 28 వేలకుపైగా

సకాలంలో తెరుచుకుంటున్నవి కేవలం 1177

పనితీరు సరిగా లేని డీలర్లకు జరిమానా విధించాలని సర్కార్‌ నిర్ణయం

సాక్షి, అమరావతి : రేషన్‌ డీలర్లు 95 శాతం మందికి పైగా రేషన్‌ షాపులను నిర్ణయించిన సమయాల్లో తెరవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. షాపుల నిర్వహణ, వాటి సమయ పాలనపై ప్రభుత్వం ఇటీవల సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో 28 వేలకుపైగా రేషన్‌ షాపులు ఉంటే వాటిలో దాదాపు 27 వేల షాపులు సరిగా తెరవడం లేదని సర్వేలో తేలింది. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతున్నవి 1,177 షాపులు మాత్రమేనని అధికారులు తేల్చారు. మిగిలిన షాపులు ఎలాంటి సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

దీంతో పనివేళలు సరిగా పాటించని డీలర్లపై జరిమానా విధించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజంతా షాపు తెరవకపోతే డీలర్‌కు రూ.500 ఫైన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను పౌరసరఫరాల శాఖ ఆదేశించింది. ప్రతి నెలా 1 నుంచి 15 వరకు లబ్ధిదారులకు సబ్సిడీ సరుకులు పంపిణీ చేయాలని, తప్పనిసరిగా పనివేళలు పాటించాలని రేషన్‌ డీలర్లకు అధికారులు స్పష్టం చేశారు. షాపులను తెరవలేదనే విషయం ఈ–పాస్‌ మిషన్ల ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు అలాంటి డీలర్లను గుర్తించి వారికిచ్చే కమీషన్‌లో పెనాల్టీ మొత్తాన్ని జమ చేసుకొని మిగిలిన మొత్తాన్ని మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 

ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు
ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టిసున్నారు. రేషన్‌ షాపులకు కేటాయించిన సరుకుల పంపిణీని 5వ తేదీకల్లా పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో డీలర్లు కూడా ఆ మేరకు పంపిణీ చేస్తున్నారు. డీలర్‌ పరిధిలోని లబ్ధిదారులందరికీ సరుకులు పంపిణీ చేసిన తర్వాత రేషన్‌ షాపును ఎందుకు తెరవాలి? ఇలాంటి విషయాలు గుర్తించకుండా డీలర్లు షాపులను తెరవలేదని అధికారులు చెప్పడం సరికాదు. డీలర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోకుండా మాపైనే నెపం వేయడం ఎంతవరకు సమంజసం? 
దివి లీలామాధవరావు, రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు