కందిపప్పు.. గోధుమ పిండి..ఎక్కడ?

14 May, 2016 19:18 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్ : పౌరసరఫరాల శాఖ నుంచి కేటాయింపులు ఎక్కువగా వస్తున్నా.. ఆయా సరుకులు మాత్రం వినియోగదారులకు అందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా 1,392 రేషన్ షాపులకు ప్రతి నెలా అందిస్తున్న సరుకులు నామమాత్రంగానే ఉంటున్నాయి. రేషన్ కార్డుల ద్వారా గతంలో మొత్తంగా తొమ్మిది సరుకులను ఇచ్చేవారు. అందులో వినియోగదారులు కొన్ని సరుకులను విడిచిపెట్టినా మిగతా సరుకులను మాత్రం తీసుకునే వారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. వీటికి సంబంధించి ప్రతి నెలా క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్‌లు చూపుతూ సరుకులను కేటాయిస్తున్నారు. అలాగే వీటితో పాటు ఇవ్వని సరుకులకు కూడా ప్రతి నెలా ఇంత ఇస్తున్నామని కేటాయింపులు చూపించడం విశేషం. కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలను ఎక్కడా పంపిణీ చేయడం లేదు. అయినా ప్రతి నెలా కేటాయింపులో మాత్రం ఈ సరుకులను ఇస్తున్నట్లు పొందుపరుస్తున్నారు. జిల్లాలో 6,78,835 రేషన్ కార్డులుండగా అన్నపూర్ణ-839, అంత్యోదయ-76,009, తెలుపు రంగు కార్డులు-6,01,987 కార్డులున్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు ఇస్తున్నామని కీ రిజిస్టర్‌లో చూపిస్తున్నారు. కానీ పంపిణీ మాత్రం జరగడం లేదు. పామాయిల్ పంపిణీ లేకపోయినా కేటాయింపుల్లో చూపించడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండిని ప్రతి నెలా ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ నెలకు సంబంధించి 6.74 టన్నుల కందిపప్పు, 6.58 టన్నుల గోధుమ పిండి, 6.71 టన్నుల గోధుమలు ఇస్తున్నట్లు కేటాయింపులో పొందుపరిచారు. అసలు సరుకులే ఇవ్వకుండా ఈ కేటాయింపులు ఎందుకని డీలర్లు, వినియోగదారులు విమర్శిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు