అమ్మో..ఎలుకలు!

24 Oct, 2018 13:35 IST|Sakshi
అవనిగడ్డలో ఎలుకలు కొట్టేసిన పొలం

పంటను కొరికేస్తున్న మూషికాలు .. దివిసీమ రైతుల బెంబేలు

దివిసీమలో ఎలుకలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టపడి పెంచుకున్న పంట మూషికపరం కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను నాశనం చేస్తున్న ఎలుకల నివారణకు బుట్టలు, మందులు పెట్టినా ప్రయోజనం లేదని కొందరు రైతులుఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణాజిల్లా, అవనిగడ్డ : దివిసీమలో ఈ ఏడాది 97 వేల ఎకరా ల్లో రైతులు  వరి సాగు చేశారు. ఘంటసాల, చల్లç ³ల్లి, మోపిదేవి మండలాల్లో  ముందుగా సాగు చేసిన వరి పంట ఈనెక, పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఉంది. చిరుపొట్ట, ఈనెక దశలో ఉన్న పొలాలకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. వర్షాలు లేకపోవడం, సాగు నీరు తక్కువుగా అందడం వల్ల ఎలుకలు పెరిగిపోయాయి. కొన్నిచోట్ల నాలుగు రోజులకొకసారి ఎలుకల నివారణకు బుట్టలు పెడుతున్నా వాటి బెడద తగ్గడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు..
అవనిగడ్డ మండలం బందలాయిచెరువు, అశ్వరా వుపాలెం, మోదుమూడి, వేకనూరు, కోడూరు మండలం వి కొత్తపాలెం, విశ్వనాధపల్లి, పిట్ట ల్లంక, సాలెంపాలెం, మాచవరం, నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, మర్రి పాలెం, ఏటిమొగ ప్రాంతాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో రెండు రోజులకొకసారి ఎలుకల నివారణకు మందులు, బుట్టలు పెడుతున్నారు. బుట్టలు పెడితే ఒక్కో ఎలుకకు రూ.20 తీసుకుంటున్నారు. ఎలుకల నివారణకు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు ఖర్చు చేసినట్టు రైతులు చెప్పారు. కొట్టేసిన వరి దుబ్బులను కూలీలతో ఏరించేందుకు ఎకరాకు రూ.2 వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని తెలిపారు.

సామూహిక నివారణకు చర్యలేవీ..
ఎలుకల నివారణకు బుట్టలు పెట్టించడం, ఒకరిద్దరు రైతులు మందు పెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. సామూహిక ఎలుకల నివారణ చర్యలు చేపడితేనే వాటి నివారణ సాధ్యమవుతుందని రైతులంటున్నారు. వ్యవసాయ శాఖాధికారులు సామూహిక ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలని వారుకోరుతున్నారు.

రూ.17వేల ఖర్చయింది
ఈ ఏడాది ఎలుకల బెడద ఎక్కువగానే ఉంది. నారుమళ్ళు పోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఎలుకల బుట్టలు పెట్టించాను. మూడెకరాలకు రూ.17 వేలు ఖర్చులు అయ్యాయి. ఎలుకలు కొట్టిన వరి దుబ్బులను కూలీలతో ఏరిస్తున్నాను. సామూహిక ఎలుకల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– గాజుల రాంబాబు (రాముడు), రైతు, బందలాయిచెరువు

మరిన్ని వార్తలు