టీటీడీ చైర్మన్‌గా రవిశంకర్‌ ?

8 Sep, 2017 20:13 IST|Sakshi
టీటీడీ చైర్మన్‌గా రవిశంకర్‌ ?

సాక్షి, అమరావతి: గత కొంత కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మెన్‌ పదవికోసం పోటీపడుతున్న నందమూరి హరికృష్ణకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు షాక్‌ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ గా వ్యాపారవేత్త సీఎం రవిశంకర్ నియామకం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. శనివారం జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించి జీవో విడుదల కానుంది.

రవి శంకర్‌ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన బడా వ్యాపారవేత్త. ఏడాది కాలం పాటు ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారు. దీంతోపాటు 19 మంది సభ్యలతో కూడిన టీటీడీ పాలకమండలిని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. బోర్డు సభ్యులుగా.. సుధా నారాయణ మూర్తి, కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రా రెడ్డి, రాఘవేంద్ర రావు, ఎమ్మెల్యే కొండబాబు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్ మోహన్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్‌ వై.వి. అనూరాధ, టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఇందులో ఉన్నారని తెలుస్తోంది.

దీనిపై నందమూరి హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన్ను బుజ్జగించడానికి పార్టీ సీనియర్‌ నేతలను రంగంలోకి దించారు చంద్రబాబు. ఈసారి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి నామినేట్‌ చేస్తామని నాయకుల ద్వారా వర్తమానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.