ఇలా భయపడితే ఎలా...

3 Apr, 2020 12:28 IST|Sakshi
కొత్తపేట రోడ్డును రావులపాలెం వద్ద మూసివేసి ఆందోళన చేస్తున్న స్థానికులు

క్వారంటైన్‌ సెంటరుకు అనుమానితుల తరలిస్తుంటే ఆందోళన తగదు

ఇళ్ల నుంచి బయటకు రాకపోతే ఎలా సోకుతుందంటున్న వైద్యులు

కష్టకాలంలో సహకరించాలని అభ్యర్థన

సాక్షి, తూర్పుగోదావరి, రావులపాలెం : కొత్తపేట మండలంలో కరోనా వైరస్‌ అనుమానితులను రావులపాలెం జెడ్పీ హైస్కూల్‌లో క్వారంటైన్‌కు తీసుకురాగా స్థానికులు గురువారం అడ్డుకున్న ఘటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం స్థానిక హైస్కూల్‌లో 40 మంచాలు ఏర్పాటు చేసి ఇక్కడ క్వారంటైన్‌ వార్డు ఏర్పాటు చేశామని అధికారులు ప్రకటనపై స్థానికుల్లో కొంతమంది నిరసనలకు దిగారు. భౌతిక దూరం పాటించాలి...ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ సూచనలిస్తుంటే ... ఓ గదిలో బంధిస్తుంటే భయపడుతున్నారెందుకని వైద్యులు, ఉన్నతాధికారులు అంటున్నారు. అలా అయితే నిత్యం రోగుల మధ్యనే ఉంటూ వైద్య చికిత్సలు చేస్తున్న వైద్యులు, సిబ్బంది పరిస్థితి ఏమిటని, రోడ్లపై మనందరి కోసం పని చేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల గతి ఏమిటో ఓ సారి ఆలోచించాలని మేధావులు ప్రశ్నిస్తున్నారు.

కొత్తపేట మండలంలోని ముగ్గురిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో వారి సంబంధితులను అనుమానితులుగా గుర్తించి అంబులెన్స్‌లో రావులపాలెం హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాఠశాల గేటు మార్గానికి దుంగలు అడ్డంగా వేసి అడ్డుకున్నారు. దీంతో ఇక్కడకి తీసుకువచ్చిన వారిని భట్లపాలెం క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే క్వారంటైన్‌ వార్డు ఏర్పాటు చేశామని తహసీల్దారు జిలాని బదులిచ్చారు. ఆర్డీఓ బి.భవనీ శంకర్‌ మాట్లాడుతూ కొత్తపేటలో ఏరియా ఆస్పతి ఉన్నా అక్కడకు అన్ని రకాల చికిత్సల కోసం బాధితులు వస్తారని, ఆ ఆసుపత్రిలో క్వారంటైన్‌ వార్డు ఏర్పాటు చేయకూదని అన్నారు. జనావాసాలకు దూరంగా ఏవైనా సౌకర్యాలు ఉంటే వాటిని పరిశీలిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు