పోస్టల్‌ బ్యాలెట్‌లో అక్రమాలు, వీడియో కలకలం

17 May, 2019 14:24 IST|Sakshi

రాయదుర్గంలో పోలీసుల నిర్వాకం

మహిళా వలంటీర్ల పోస్టల్‌ బ్యాలెట్లను టీడీపీకి వేయించిన పోలీసులు 

కలకలం రేపుతున్న వీడియోలు 

హెడ్‌ కానిస్టేబుల్‌పై బదిలీవేటుతో సరిపెట్టిన ఉన్నతాధికారులు  

సాక్షి, అనంతపురం ‌: సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఓటర్లను ప్రభావితం చేయడం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేయడమే కాకుండా ఏకంగా మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్‌ బ్యాలెట్లను బలవంతంగా టీడీపీకి వేయించినట్లు బయటపడుతోంది. బాధిత మహిళల వీడియో టేపులు ప్రస్తుతం పోలీసుశాఖలో కలకలం రేపుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో మొత్తం ముగ్గురు అధికారుల ప్రమేయమున్నా కేవలం ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి.  

టీడీపీకి ఓట్లు పడేలా వ్యూహం 
పోలీసుశాఖలో మహిళల సమస్యల పరిష్కారం కోసం ఇటీవల మహిళా పోలీసు వాలంటీర్లను ఎంపిక చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వారి సేవలను కూడా వినియోగించారు. విధుల్లో ఉండటంతో వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. అయితే రాయదుర్గం నియోజకవర్గంలో మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్‌ బ్యాలెట్‌లన్నీ ఏకపక్షంగా టీడీపీకి పడేలా పోలీసులు వ్యూహం రచించినట్లు తెలిసింది. రాయదుర్గం అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న ఓబుళపతి అనే హెడ్‌ కానిస్టేబుల్‌ అంతా తానై వ్యవహరించిన విషయం బయటపడింది. దీంతో ఇతనిపై రెండురోజుల క్రితం ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. అతన్ని వీఆర్‌కు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయడమే కాకుండా రూ.లక్షలు ముడుపులు తీసుకొని మహిళా పోలీసు వాలంటీర్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను బలవంతంగా టీడీపీకి వేయించారని తెలుస్తోంది. పలువురు బాధిత మహిళా వాలంటీర్లు కూడా ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో టేపులు బయటకు పొక్కడంతో పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.  

ఒక్కో వలంటీర్‌కు రూ. వెయ్యి 
తెలుగుదేశం పార్టీ నుంచి లక్షల్లో పోలీసు స్టేషన్‌కు ముడుపులు వచ్చాయని, అయితే ఒక్కో మహిళా వలంటీర్‌కు పోస్టల్‌ బ్యాలెట్‌ వేయాలని రూ.1000 చొప్పున ఇచ్చినట్లు వీడియో టేపుల్లో పేర్కొన్నారు. కొంతమంది ఎదురు ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి పీకేస్తామని బెదిరించినట్లు వాపోయారు. ఈ వ్యవహారంలో హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు మరో మహిళా కానిస్టేబుల్, ఓ ఎస్‌ఐ ఉన్నట్లు వీడియో టేపుల్లో బయటపడింది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పోస్టల్‌ బ్యాలెట్‌లో టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న పోలీసులు

వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు
మరోవైపు గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ పోలింగ్‌ ఏజెంట్‌ హరికృష్ణపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. హరికృష్ణ తోటలో బోర్‌ను సీజ్‌ చేయాలంటూ టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
వైఎస్సార్ సీపీ ఏజెంట్‌పై కక్ష సాధింపు

మరిన్ని వార్తలు