కొనసాగుతున్న రాయలసీమ బంద్‌

24 May, 2017 09:29 IST|Sakshi

అనంతపురం: కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వామపక్ష పార్టీలు పిలుపుమేరకు బుధవారం రాయలసీమలో బంద్‌ కొనసాగుతోంది . నాలుగు జిల్లాల్లో ఆ  పార్టీల కార్యకర్తలు, అనుబంధ సంఘాల కార్యకర్తలు పలు ఆర్టీసీ డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. బస్సులపై ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు రాళ్లు రువ్వగా వీరిని పోలీసులు అరెస్టు చేశారు.

గుంతకల్లులో ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం నేతలు బస్సులను అడ్డుకున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తడకలేరులో జాతీయ రహదారిని దిగ్బంధించడంతో హైదరాబాద్‌-బెంగళూరు మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

కడపలో బద్వేలు సర్కిల్‌లో వామపక్ష నేతలు బైఠాయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. తిరుపతిలో బస్టాండు వద్ద ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు, ఎమ్మిగనూరుల్లో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు