బాబూ.. రాయలసీమ కరువు పట్టదా?

7 Mar, 2016 03:48 IST|Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రాయలసీమలో  కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదని  రాయలసీమ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ నాగరాజు మండిపడ్డారు. ఆదివారం ఉదయం పాతబస్టాండ్‌లోని ఆ ఫ్రంట్ కార్యాలయంలో  రౌంట్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు హాజరై చంద్రబాబునాయుడు పాలనలో సీమకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..సీమ రైతులు పంటలు పండక ఆత్మహత్యకు పాల్పడుతుంటే సాగునీటిని కోస్తాకు పంపుతూ వారికి మేలు చేస్తున్నారన్నారు. ఆదరించి అన్నం పెట్టిన సీమ జిల్లాలను ముఖ్యమంత్రి  మోసగిస్తున్నారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీవీనాయుడు పేర్కొన్నారు.

రాయలసీమకు జరగుతున్న అన్యాయంపై ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ప్రజా సంఘాలపై ఉందని పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు. ప్రత్యేక రాయల సీమ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన సమయం అసన్నమైందని ఆర్‌పీఎఫ్ కన్వీనర్ నాగరాజు పిలుపునిచ్చారు. సమావేశంలో ఓబీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పీజీ వెంకటేష్, ఆర్‌పీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయన్న, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సత్యం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు