రాయలసీమ పౌరుషాన్ని చాటుదాం

20 Nov, 2014 03:15 IST|Sakshi
రాయలసీమ పౌరుషాన్ని చాటుదాం

దేవనకొండ: రాయలసీమ రాష్ట్ర సాధనకు ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్ధం కావాలని.. సీమ పౌరుషం చాటేందుకు సన్నద్ధులు కావాలని రాయలసీమ ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కందనాతి క్రిష్ణయ్య, ఉపాధ్యక్షుడు నాగభూషణం అన్నారు. మండలంలోని తెర్నెకల్ గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర బుధవారం తేరుబజార్‌కు చేరుకుంది. గ్రామ వీధుల్లో ర్యాలీ నిర్వహించిన అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీబాగ్ ఒడంబడిక ఉల్లంఘనకు నిరసనగా, సీమకు తలపెట్టిన అన్యాయాన్ని గుర్తు చేసేందుకే సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సిపాయిల తిరుగుబాటుకు ముందు 1801లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తెర్నేకల్‌కు చెందిన ముత్తుకూరు గౌడప్ప ఆధ్వర్యంలో 15 రోజుల పాటు వీరోచిత యుద్ధం జరిగిందన్నారు. ఆ సందర్భంగా తెల్లదొరలు దాదాపు 400 మందిని చంపి ఊళ్లోని కుక్కలబావిలో పడేయగా, ముగ్గురు వీరులను ఊరు వాకిలికి ఉరి తీశారన్నారు. స్వాతంత్య్రోద్యమంలో తెర్నేకల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

అయితే అమరవీరుల త్యాగాలను ప్రభుత్వాలు విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని స్మరిస్తూ ఈ గ్రామం నుంచే సీమ హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలన్నారు. కర్నూలు నుంచి రాజధానిని తరలించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బడ్జెట్ విషయంలో సీమకు యేటా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమరవీరుల త్యాగాలను గుర్తించి వారి విగ్రహాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. సీమ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు.

గూళ్యం వద్ద వేదావతి నదిపై ఎత్తిపోతల ప్రాజెక్టును సత్వరం నిర్మించాలన్నారు. అంతకు ముందు అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఐదు నిముషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో జనసభశోచిత అధ్యక్షుడు పోతన, రాయలసీమ గని కార్మిక సంఘం నాయకులు శివశంకర్, నాగరాజు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, పీడీఎస్‌యూ నాయకుడు మధు, రిటైర్డ్ తహశీల్దార్లు రోషన్‌ఆలీ, అజయ్‌కుమార్, రాయలసీమ ఉద్యోగుల సంఘం నాయకడు పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు సురేందర్‌రెడ్డి, సర్పంచ్ రాజన్న, ఉపసర్పంచ్ సత్యరాజు, మాజీ ఎంపీటీసీ వీరన్న, ఎంపీటీసీలు జయమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ లుముంబా, బీసీ మాదన్న, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.
 
 సీమ అభివృద్ధిని విస్మరించిన సీఎం
 రాయలసీమ గడ్డపై పుట్టిన సీఎం చంద్రబాబనాయుడు ఈ ప్రాంత అభివృద్ధినే విస్మరించారని వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ జిల్లా కన్వీనర్ తెర్నెకల్ సురేందర్‌రెడ్డి అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సిపాయిల తిరుగుబాటుకు ముందే గ్రామంలో ఆంగ్లేయులపై వీరోచిత పోరు సాగిందన్నారు. ఆ చరిత్రను పాలకులు తొక్కిపెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమర వీరుల త్యాగాలను గుర్తించి గ్రామంలో విగ్రహాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. యేటా స్వాతంత్య్ర దినోత్సవం రోజున గ్రామంలో అధికారిక కార్యక్రమాల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు