శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై రాయపాటి సంచలన వ్యాఖ్యలు

31 Aug, 2014 14:33 IST|Sakshi
రాయపాటి సాంబశివ రావు

గుంటూరు: ఏపి రాష్ట్ర రాజధానిపై  శివరామకృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికపై  ఎంపి రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిటీ సభ్యులకు దొనకొండ ప్రాంతంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు. వారికి భూములున్న కారణంగా వారు ఆ ప్రాంతం రాజధానికి అనువైనదిగా చెప్పుకొస్తున్నారన్నారు. ఏదిఏమైనా విజయవాడ- గుంటూరు మధ్యే రాజధాని ఉంటుందని రాయపాటి చెప్పారు.

ఏపి రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ కేంద్ర అర్బన్ డవలప్మెంట్ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.శివరామకృష్ణన్ కాగా,  సభ్యులుగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పోలసీ డైరెక్టర్ డాక్టర్ రతిన్ రాయ్,  బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమర్ రేవి, న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ జగన్ షా, న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కీటెక్చర్ మాజీ డీన్ కె.టి.రవీంద్రన్ ఉన్నారు. ఈ కమిటీ ఈ నెల 27న కేంద్ర హొం శాఖకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. రాయపాటి వ్యాఖ్యలు వివాదానికి దారితీసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు