కొత్త రూపాయి నోటు వచ్చిందోచ్‌

29 Nov, 2017 10:43 IST|Sakshi

కడప కోటిరెడ్డి సర్కిల్‌: రూపాయి నోట్లు ఇంతకు ముందు నుంచే ఉన్నాయి. ఇదేమి కొత్తగా చెబుతున్నారనే కదా! మీ సందేహం.. అవునవును కొత్త సంగతే మ రి. కేంద్ర ప్రభుత్వం గతేడాది రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో మొదట రూ.2000 నోట్లను, తరువాత రూ.500 నోట్లను విడుదల చేసింది. కరెన్సీ వాడకంపై కఠిన నిబంధనలు విధించడంతో ప్రజలకు చిల్లర సమస్యలు వచ్చాయి. చిల్లర కొరతను అధిగమించడానికి దాదాపు 10 నెలల అనంతరం రిజర్వ్‌ బ్యాంకు రూ.200 నోట్లను విడుదల చేసింది.

అయినా ఇంకా చిల్లర సమస్య తీరలేదు. ఈ క్రమంలో తాజాగా ఒక్క రూపాయి నోట్లను రిజర్వ్‌ బ్యాంకు విడుదల చేసింది. వారం క్రితం విడుదలైన ఈ నోట్లు కేవలం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మినహా ఇతర బ్యాంకుల్లోకి రాలేదు. మార్కెట్‌లో వీటిని ఇస్తుంటే వ్యాపారులు రూపాయికి ఏమి వస్తుందని హేళన చేస్తున్నారని పలువురు అంటున్నారు. రూపాయి విలువతో కొనుగోలు చేసే వస్తువులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు దాదాపు రూపాయి నోటును చాలా కాలం కిందట మరచిపోయారు. బస్సుల్లో చార్జీగాను, టీ దుకాణాల్లో మాత్రమే చాలా వరకు రూపాయి, రెండు రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. విలువ లేని రూపాయికి.. కొత్త రూపాయి నోట్లు విడుదల చేయడం వల్ల ఒరిగేదేముందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని వార్తలు