ఆరా తీస్తున్న ఆర్బీఐ!

20 Jul, 2014 01:54 IST|Sakshi
ఆరా తీస్తున్న ఆర్బీఐ!

 తుపాన్, కరువు మండలాల్లో పంట దిగుబడి వివరాల సేకరణ
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల తీరుపై సందేహాలు
 తమకు చెప్పకుండా ఏదో దాస్తున్నారనే అనుమానం
 
 సాక్షి, హైదరాబాద్: తుపాను, కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాల రీ షెడ్యూల్‌ను కోరుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనేక సందేహాలను వ్యక్తం చేస్తోంది. గత ఏడాది ఖరీఫ్‌లో పంట రుణాలకు సంబంధించి ఇప్పుడు రీ షెడ్యూల్ కోరడంతో అసలు ఆ సీజన్‌లో ఆయా జిల్లాలు, మండలాల్లో పంట దిగుబడులు ఎంతో తెలుసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ విషయం గురించి  నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను వివరాలు కోరకుండా స్థానిక ఆర్బీఐ సహకారం తీసుకుంటోంది. హైదరాబాద్‌లోని ఆర్బీఐ స్థానిక కార్యాలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత ఖరీఫ్‌లో తుఫాను, కరువు మండలాలుగా ప్రకటించిన చోట్ల పంటల దిగుబడి వివరాలను సేకరించి ముంబైలోని ఆర్బీఐకి తెలియజేయనుంది. రుణాల రీ షెడ్యూల్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలు ఇవ్వకుండా ఏదో దాస్తున్నారనే అనుమానం ఆర్బీఐ వర్గాల్లో నెలకొన్నట్లుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పంట దిగుబడి వివరాలను అడిగారని, సాధారణంగా రుణాల రీ షెడ్యూల్‌కు ఇటువంటి వివరాలను ఆర్బీఐ కోరదని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. పైలీన్ తుఫాను నష్టానికి ఇప్పుడు రీ షెడ్యూల్ ఏమిటని ఆర్‌బీఐ వర్గాలు ఆరా తీశాయి. అదే సమయంలో ఒడిశాలో కూడా తుఫాను సంభవించిందని, అక్కడ రైతుల పంట రుణాలు రీ షెడ్యూల్ చేశారనే విషయాన్ని అధికారులు ఆర్బీఐ దృష్టికి తెచ్చారు. అయినా పంట దిగుబడి వివరాలను కోరడాన్ని బట్టి చూస్తే రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఇప్పట్లో అనుమతినిచ్చే అవకాశాలు కనిపించడం లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రీ షెడ్యూల్‌కు సంబంధించి వాణిజ్య, గ్రామీణ, సహకార బ్యాంకుల్లోని ఖాతాల వివరాలను పంపించడంతో పాటు ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో ప్రణాళికను సమర్పిస్తేగానీ రీ షెడ్యూల్‌కు అనుమతించే అవకాశం లేదని పేర్కొంటున్నాయి. ఇదంతా పూర్తయ్యేసరికి ఖరీఫ్ సీజన్ ముగిసేలా ఉందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు