తుంగభద్ర బోర్డు పరిధిలోకి ఆర్డీఎస్!

23 May, 2016 04:11 IST|Sakshi
తుంగభద్ర బోర్డు పరిధిలోకి ఆర్డీఎస్!

ఆనకట్ట ఎత్తు పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చిన తెలంగాణ, కర్ణాటక
చర్చలకు పిలిచినా స్పందించని ఏపీ ప్రభుత్వం
ఆర్డీఎస్ వివాదంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు
మూడు రాష్ట్రాలతో చర్చించాలని టీబీ బోర్డుకు లేఖ
ఈ నెల 25న మూడు రాష్ట్రాలతో చర్చించే అవకాశం?
 

 
కర్నూలు సిటీ:  రెండున్నర దశాబ్దాలుగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదంగా మారిన రాజోలి బండ డెవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టను తుంగభద్ర బోర్డు పరిధిలోకి చేర్చేందుకు కసరత్తు జరుగుతుంది. తుంగభద్ర నదిపై నిర్మించిన ఈ ఆనకట్టతో పాటు, కాల్వల ఆధునికీకరణకు 2008లో  నిధులు మంజూరు అయ్యాయి. కాల్వల ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తికాగా ఆనకట్ట పనులు మిగిలాయి. ఈ పనులు చేసేందుకు కుడి వైపు ఉన్న కర్నూలు రైతులు వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. సున్నితమైన ఈ సమస్య పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో  తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆనకట్ట ఎత్తును పెంచేందుకు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి పాటిల్‌తో చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఆనకట్ట పనులు చేసేందుకు రాయచూర్ సర్కిల్ ఇంజనీర్లు సామగ్రితో ఆర్డీఎస్ దగ్గరకు వచ్చారు.

సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లాకు చెందిన అధికారులు అక్కడికి చేరుకుని పనులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తరువాతే ముందుకు పోవాలని చెప్పడంతో వారు వెనుదిరిగారు. ఆనకట్ట ఎత్తు పెంచే పనులు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆ పనులు చేయడం వల్ల దిగువ ప్రాంతానికి ఎలాంటి నష్టం లేదంటూఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది.  స్పందించిన కృష్ణాబోర్డు ఆర్డీఎస్ ఆనకట్టను టీబీబోర్డు పరిధిలోకి చేర్చుకునేందుకు కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో చర్చలు జరపాలని మూడు రోజుల క్రితమే టీబీ బోర్డుకు లేఖ రాసినట్లు తెలిసింది. ఈమేరకు  ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించేందుకు టీబీ బోర్డు అధికారుల బృందం సోమవారం రానుంది. ఈ నెల 25వ తేదీన మూడు రాష్ట్రాలకు చెందిన అధికారులతో చర్చలు జరిపేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
 
చర్చలతోనే వివాదం పరిష్కారం
ఆర్డీఎస్ ఆనకట్టపై చాలా రోజుల నుంచి రగులుతున్న వివాదంపై కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిసి చర్చలు జరిపితే పరిష్కారమవుతుంది. సున్నితమైన సమస్యపై తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింటే బాగుండేది. ఆర్డీఎస్  టీబీ బోర్డు పరిధిలోకి పోతే నష్టం అని ఖచ్చితంగా చెప్పలేం. అయితే ఆనకట్ట వెంట్స్ మూత వేస్తే మాత్రం దిగువ ఉన్న కేసీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. - సుబ్బరాయుడు, సాగు నీటిరంగ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్
 
 
టీబీ బోర్డుపరిధిలోకి చేర్చితే సీమకే నష్టం !
తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి మండలం రాజోలి బండ గ్రామం, కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు గ్రామాల మధ్య ఆర్డీఎస్ ఆనకట్టను నిర్మించారు. ఎడమ వైపునకు ఆర్డీఎస్ కాల్వ ఏర్పాటు చేశారు. ఈ కాల్వ నుంచే కర్ణాటక, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీరు అందుతుంది. ప్రస్తుతం ఉన్న ఆనకట్ట ఎత్తును మరో 6 ఇంచులు పెంచుకుంటే తమ ప్రాంతానికి కొంత మేరకైనా నీరు వస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరాట పడుతుండగా..   ఈవిధంగా చేస్తే దిగువకు నీరు రాదని  కర్నూలు జిల్లా ఆయకట్టు రైతులు వాపోతున్నారు.

ఈ పరిస్థితుల్లో  ఒక వేళ ఆనకట్టను టీబీ బోర్డు పరిధిలోకి చేర్చితే రాయల సీమ జిల్లాలకు తీవ్రమైన సాగు, తాగు నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ బోర్డు పరిధిలో ఉన్న ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్సీ కాల్వలకు వాటా నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ వివాదంపై చర్చించేందుకు చర్చలకు రావాలని తెలంగాణ ప్రభుత్వం పిలిచినప్పటికీ  ఏపీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదు. కనీసం దీనిపై కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వివాదం పరిష్కారమయ్యేలా చూడాలని ఈ ప్రాంత రైతులు, సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు