ముగిసిన రీపోలింగ్‌

7 May, 2019 04:10 IST|Sakshi
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలో ఓటర్ల క్యూ..

రాష్ట్రంలో ఐదు చోట్ల 81.48% పోలింగ్‌ నమోదు

నేటి నుంచి కౌంటింగ్‌ ఏర్పాట్లపై దృష్టి

కేబినెట్‌ సమావేశాలపై స్పష్టమైన నిబంధనలున్నాయి 

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి :  రాష్ట్రంలోని ఐదుచోట్ల సోమవారం జరిగిన రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, భారీగా 81.48 శాతం పోలింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఐదు బూత్‌ల్లో 5,064 ఓటర్లకుగాను 4,079 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల ముగిసిన తర్వాత సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేశనుపల్లిలో 956 మంది ఓటర్లకు గాను 853 మంది (89.23శాతం), గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో 1,376 మంది ఓటర్లకు 1,053 మంది (75.04శాతం), ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలో 1,070 మంది ఓటర్లకు 931 మంది (87.01శాతం), నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని ఇసుకపాలెంలో 1,084 ఓటర్లకు 819 మంది (75.55శాతం), ఇదే జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలో 578 ఓటర్లకు 470 మంది (84.23శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుచోట్ల ఎక్కడా ఈవీఎంలలో సాంకేతిక సమస్యలుగానీ, శాంతిభద్రతల సమస్యగానీ ఉత్పన్నం కాలేదన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నప్పటికీ పకడ్బందీ ఏర్పాట్లుచేసిన అధికారులకు ద్వివేది అభినందనలు తెలిపారు.  

కౌంటింగ్‌పై దృష్టి 
రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తికావడంతో మంగళవారం జిల్లా నుంచి ఎంపికచేసిన 8–10 మంది అధికారులకు కౌంటింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 17లోగా జిల్లాలోని ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నియోజకవర్గానికి కనీసం 14 టేబుళ్లు తక్కువ కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదనపు టేబుళ్ల ఏర్పాటుకు నాలుగు జిల్లాలు అనుమతి కోరాయని.. వీటికి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందన్నారు. ఓట్ల లెక్కింపునకు సుమారుగా 25,000 మంది సిబ్బంది అవసరమవుతారని, వీరిని పారదర్శకంగా ఎంపికచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ద్వివేది తెలిపారు. వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యాక అధికారిక ఫలితాలను ప్రకటిస్తామన్నారు.

రూల్స్‌ ప్రకారం నడుచుకోవాలి
ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో సీఎం కేబినెట్‌ సమావేశం నిర్వహించవచ్చా లేదా అన్నది ఎన్నికల నిబంధనల్లో స్పష్టంగా ఉందని, దీనిపై తాను ప్రత్యేకంగా ఎటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదని ద్వివేది స్పష్టంచేశారు. అధికారులంతా నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని, దీనిపై ఏమైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకువస్తే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లి వివరణ తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఓ పక్క రీపోలింగ్‌ జరుగుతున్న సమయంలో సీఎం పోలవరం పర్యటన చేయడంపై  విలేకరుల అడిగిన ప్రశ్నకు కూడా నిబంధనలు చూసుకోండంటూ ద్వివేది సమాధానమిచ్చారు. నాయకులు చేసే వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. గ్రూపు–2 పరీక్షల్లో అడిగిన ప్రశ్నలపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై అధికారుల నుంచి నివేదిక కోరినట్లు ద్వివేది తెలిపారు.

మరిన్ని వార్తలు