జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం

15 Feb, 2019 04:52 IST|Sakshi
జ్యోతి బంధువులను ఈడ్చేస్తున్న పోలీసులు

తాడేపల్లి రూరల్‌/మంగళగిరి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలో హత్యకు గురైన యువతి జ్యోతి మృతిదేహానికి వైద్యులు మళ్లీ పోస్టుమార్టం నిర్వహించారు. మహానాడు కృష్ణాతీరంలో ఉన్న శ్మశాన వాటికలో గురువారం మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన పోస్టుమార్టం 3.30 గంటల వరకు కొనసాగింది. వివరాలు వెంటనే వెల్లడించాలని జ్యోతి బంధువులు, మీడియా ప్రతినిధులు కోరగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి నిరాకరించారు. 72 గంటల తర్వాత చెబుతామని అనడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వెంటనే పోస్టుమార్టం వివరాలు చెప్పాలని, గతంలో పోస్టుమార్టం జరిగిందా లేదా నిర్ధారించాలని పట్టుబట్టారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. డాక్టర్‌ టి.టి.కె.రెడ్డిని కారు ఎక్కించారు. ఆందోళనకారులు టి.టి.కె.రెడ్డి కారును అడ్డుకున్నారు.

ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొందరు యువకులు డీజిల్‌ బాటిళ్లు తీసుకొచ్చి, వంటిమీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని నిలువరించారు. ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి మాట్లాడుతూ.. పోస్టుమార్టం సంపూర్ణంగా నిర్వహించామని, జ్యోతి ఎలా చనిపోయిందో నిర్ధారించేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అన్నారు. పోలీసులు, మండల మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు రెండోసారి పోస్టుమార్టం నిర్వహించామని, మొదటిసారి పోస్టుమార్టం ఏ మేరకు చేసారనే విషయం చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు. మృతురాలి అన్న అంగడి ప్రభాకర్, తండ్రి చిన్నగోవిందు మాట్లాడుతూ.. మొదటి పోస్టుమార్టం విషయంలో డాక్టర్లు, పోలీసులు అలసత్వం వహించారని అన్నారు. ఒక ఎస్టీ యువతి చనిపోతే డీఎస్పీ దర్యాప్తు చేయాల్సి ఉండగా, సీఐతో దర్యాప్తు చేయించి కేసును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. 

కోలుకుంటున్న శ్రీనివాసరావు 
నవులూరులో అమరావతి టౌన్‌షిప్‌లో ఈనెల 11వ తేదీ రాత్రి ప్రేమికులపై దుండగులు జరిపిన దాడిలో గాయపడిన చుంచు శ్రీనివాసరావు క్రమంగా కోలుకుంటున్నాడు. తలకు గాయం కావడంతో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆరోగ్యం మెరుగుపడడంతో గురవారం ఐసీయూ నుంచి సర్జరీ వార్డుకు తరలించారు. శ్రీనివాసరావును ఎవరూ కలవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్‌బీ సీఐ ఆధ్వర్యంలోని బృందం అతడిని విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా విజయవాడకు చెందిన అతడి బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

విచారణ నుంచి డీఎస్పీని తప్పించిన ఉన్నతాధికారులు 
జ్యోతి హత్య కేసు విచారణ నుంచి నార్త్‌ జోన్‌ డీఎస్పీ రామకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు తప్పించారు. డీఎస్పీ హరి రాజేంద్రనాథ్‌బాబుకు ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే రూరల్‌ సీఐ బాలాజీని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు ఎస్‌ఐ బాబూరావును వీఆర్‌కు పంపడంతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు వేశారు.  

జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి 
హత్యకు గురైన జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలని, గాయపడిన చుంచు శ్రీనివాసరావు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయాలని, జ్యోతి కేసును నిర్లక్ష్యం చేసిన డీఎస్పీతోపాటు మిగతా అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని వివిధ గిరిజన సంఘాలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నడిబొడ్డున ఓ గిరిజన యువతి దారుణంగా హత్యకు గురైతే పోలీసులు ఇప్పటికీ సరైన ఆధారాలు సేకరించలేదని మండిపడ్డారు. కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

రాజధాని అమరావతి పరిధిలో ఎలాంటి అనుచిత సంఘటన జరిగినా ప్రభుత్వం అప్రతిష్టపాలు కాకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు జ్యోతి హత్యోదంతం మరోసారి నిరూపించింది. రాజధానిలో ఓ గిరిజన యువతి హత్యకు గురైతే పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గడిచిన మూడు రోజులుగా సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా జ్యోతి హత్య కేసుపై కథనాలు వస్తున్నా, సంఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఉన్న సీఎం చంద్రబాబుకు గానీ, ఉన్నతస్థాయి అధికారులు గానీ దీనిపై కనీసం స్పందించిన పాపాన పోలేదు.  

మరిన్ని వార్తలు