మళ్లీ అపార్ట్‌మెంట్ల జోరు

24 Feb, 2015 01:10 IST|Sakshi

‘స్మార్ట్’గా  పరుగులు
 
బహుళ అంతస్తుల పై  నగర ప్రజల మోజు
స్మార్ట్ సిటీ ప్రకటన తో ఊపందుకున్న లావాదేవీలు
 

విశాఖపట్నం : రాష్ట్ర విభజనతో విశాఖలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం స్మార్ట్‌సిటీ ప్రకటనతో మళ్లీ జోరందుకుంది. అమెరికా సాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోవాలన్న కోరిక పెరిగింది. దీంతో అందరూ ఫ్లాట్లు కొనాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో వ్యక్తిగత ఇళ్లన్నీ అపార్ట్‌మెంట్ రూపంలోకి దూసుకుపోతున్నాయి. ఈ వరసలో నగర శివారు మధురవాడ, ఎండాడ, విశాలాక్షినగర్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి తదితర ప్రాంతాలు ముందున్నాయి. మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో వ్యక్తిగత ఇళ్లకంటే అపార్ట్‌మెంట్ల నిర్మాణాలే అధికంగా కన్పిస్తున్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్ సంస్కృతి కొంతకాలం నుంచి అనూహ్యరీతిలో అభివృద్ధి సాధిస్తోంది. పూర్వం మొత్తం వందలోపే అపార్ట్‌మెంట్‌లు ఉండేవి. ప్రస్తుతం నగరం విస్తరించడంతో ఆ సంఖ్య 20 వేలు దాటింది. మరో పది వేలకుపైగా నిర్మాణంలో ఉన్నాయి. పిండి కొద్దీ రొట్టె అన్న చందంగా అతి సాధారణ స్థాయి నుంచి ఆధునిక సదుపాయాలతో కూడిన ఫ్లాట్‌లు నిర్మించి ఖాతాదారుల అభిరుచి మేరకు అందిస్తున్నారు.
 
ఇదీ కారణం...

నగరం ‘స్మార్ట్’గా పరుగులు పెడుతోంది. ఐటీ సిగ్నేచర్ టవర్లు, నిరంతర వైఫై సౌకర్యం.. ఇలా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ అందుబాటులోకి వస్తోంది. కన్వెన్షన్ సెంటర్, హైదరాబాద్ హైటెక్ సిటీని తలదన్నే రీతిలో నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. ప్రస్తుతం ఏమూల చూసినా చదరపు గజం రూ.25 వేలకు తక్కువ లేదు. వంద గజాలు కొని ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.40 లక్షల మంచి రూ.50 లక్షలకు తక్కువ ఖర్చుకావడం లేదు. అంతేకాకుండా కార్మికుల కొరత, భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ప్లాన్, మంచినీటి కనెక్షన్, విద్యుత్తు ఇలా అనేక సమస్యలతోపాటు సమయం కూడా ఆదా అవడంతో ప్రజలు ఫ్లాట్ల వైపు మక్కువ చూపుతున్నారు. మరో ముఖ్యమైన కారణమేమిటంటే భద్రత. పట్టపగలే నగరంలో చోరీలు అధికమవడం, నేరస్తులు ఎంతటి దారుణాలకైనా తెగబడడంతో ఫ్లాట్లు అన్ని విధాలా మేలనే భావన పెరగడంతో వీటికి డిమాండ్ అధికమైంది. దీంతోపాటు బిల్డర్లే బ్యాంకు రుణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుకు మరింత సౌలభ్యం ఏర్పడుతోంది.
 
ఆధునిక వసతులు

నిర్మాణ రంగంలో ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒకప్పడు కేవలం స్థానికంగా లభించే మెటీరియల్స్‌తోనే అపార్ట్‌మెంట్లు నిర్మించేవారు. ఇప్పుడు విదేశీ సామగ్రి, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. అపార్ట్‌మెంట్ భద్రత కోసం విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, జిమ్, స్టీమ్ ఫంక్షన్ హాలు, వాకింగ్ ట్రాక్, మహిళలకు లేడీ క్లబ్‌లు... ఇలా ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఫ్లాట్స్ అందుబాటులో లభిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో గ్రూప్ హౌసెస్, విల్లాలు నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిర్మాణంలో కొందరు బిల్లర్లు ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఖాతాదారుడికి ఏం చెబుతారో అదే చేయుడంతో ఇటువంటి వారు కట్టే అపార్ట్‌మెంట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వ్యాపారమంటేనే నమ్మకం, దాన్ని పోగొట్టుకుంటే దేనికి పనికిరామనే నినాదంతో నడుస్తున్న బిల్లర్లను మనం చూడొచ్చు.

కొనేటప్పుడు జాగ్రత్తలు...

ఎంతో కష్టపడితేగాని చాలామంది జీవితకాలంలో సొంత గృహాన్ని సొంతం చేసుకోలేరు. మరి ఫ్లాట్ కొనేటపుపడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. స్థలం యజమానికి, బిల్డర్‌కు మధ్య ఒప్పంద పత్రాలను చూసుకోవాలి. ఎన్‌కంబరెంట్ సర్టిఫికేట్ (ఈసీ) తీసుకోవాలి. క్లియర్ టైటిల్, దానికి సంబంధించిన లింక్ దస్తావేజులు చూసుకోవాలి. తెలీకపోతే న్యాయవాదిని, అనుభవజ్ఞుడైన దస్తావేజు లేఖరిని సంప్రదించాలి. మనం కొనే ఫ్లాట్ నిర్మాణంలో ఉంటే నెలకొకసారైనా వెళ్లి చూసుకోవాలి. దీంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణాల్లో అన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా.. అనేది పరిశీలించాలి. భూగర్భ నీటి నిల్వ పైపు కనెక్షన్, ఫైరింజన్, నియంత్రణ పరికరాలు, ఫైర్‌పంపులు, హోజ్‌రీలు, తదితర అంశాలు ఏర్పాటు చేశారా లేదా..? అనేది పర్యవేక్షించాలి. మరో ముఖ్యమైన విషయం... బిల్డర్ నుంచి ఏమి కోరుకుంటున్నామో అవి రాతపూర్వకంగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు స్వర్గసీమగా మారుతుంది.
 
 

>
మరిన్ని వార్తలు