పీడీసీసీబీ కొత్త చైర్మన్‌ ఎన్నికకు రంగం సిద్ధం..!

17 Oct, 2017 11:20 IST|Sakshi

ఎన్నిక నిర్వహించాలంటూ డైరెక్టర్ల వినతి

మంగళవారం ఆర్‌సీఎస్‌కు లేఖ

తొలుత ఎన్నికల అథారిటీ నియామకం

20న చైర్మన్‌ ఎన్నిక జరిగే అవకాశం..?

చైర్మన్‌ రేస్‌లో ఆశావహులు

సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (పీడీసీసీబీ) కొత్త చైర్మన్‌ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈదర మోహన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త చైర్మన్‌ ఎన్నిక అనివార్యమైంది. ఈ నెల 11న ఈదర తన చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. 12న సహకార శాఖ రిజిస్ట్రార్‌ ఈదర రాజీనామాను ఆమోదించారు. చైర్మన్‌ రాజీనామా నేపథ్యంలో నిబంధనల మేరకు 15 రోజుల్లో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈదర రాజీనామాతో ఈ నెల 13న వైస్‌ చైర్మన్‌ కండె శ్రీనివాసులు తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. 15 రోజుల్లో కొత్త చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అథారిటీని నియమించాలని ఆర్‌సీఎస్‌ను కోరాలని సోమవారం సమావేశమైన పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీఎస్‌కు లేఖ పంపనున్నారు. అనంతరం ఆర్‌సీఎస్‌ ఎన్నికల అథారిటీని నియమించే అవకాశం కనిపిస్తోంది. దీంతో 15 రోజుల లోపు కొత్త చైర్మన్‌ ఎంపికకు ఆర్‌సీఎస్‌ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 20నే కొత్త చైర్మన్‌ ఎన్నిక ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

కొత్త చైర్మన్‌గా మస్తానయ్య..?
కొత్త చైర్మన్‌ ఎన్నికకు సహకార శాఖ సిద్ధమైన నేపథ్యంలో డైరెక్టర్లలో చైర్మన్‌ పదవి కోసం పోటీ నెలకొంది. గతంలో వైస్‌ చైర్మన్‌గా చేసిన అధికార పార్టీకి చెందిన బల్లికురవ పీఏసీఎస్‌ అధ్యక్షుడు మస్తానయ్య చైర్మన్‌ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జె.వి.పాలెం పీఏసీఎస్‌ అధ్యక్షుడు యలమందరావు, కారుమంచి పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.వెంకట్రావులు సైతం చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పీడీసీసీబీ వ్యవహారంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈయన ఆది నుంచి పాత చైర్మన్‌ ఈదర మోహన్‌తో విభేధించారు. ఇరువురి మధ్య గొడవ రోడ్డెక్కింది. ఈదర మోహన్‌ను దించేందుకు అప్పట్లో వైస్‌ చైర్మన్‌గా ఉన్న మస్తానయ్య గట్టిగా ప్రయత్నించారు. మెజార్టీ డైరెక్టర్లు ఈదర మోహన్‌కు మద్ధతు పలకడంతో ఆయన పోరాటం ఫలించలేదు. చివరకు మెజార్టీ డైరెక్టర్లు మోహన్‌కు వ్యతిరేకంగా మారడంతో ఎట్టకేలకు ఆయన పదవీచ్యుతుడయ్యారు. ప్రస్తుతం మస్తానయ్యకు దామచర్ల మద్ధతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్లు కూడా ఎమ్మెల్యే సూచనల మేరకు మస్తానయ్యను చైర్మన్‌ను చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. చైర్మన్‌ ఎన్నికకు తేదీ ఖరారైతే ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు