మహిళలకు సగం కోటా!

22 Jun, 2019 04:03 IST|Sakshi

గ్రామ–వార్డు వలంటీర్ల నియామక విధి విధానాలు రెడీ

నేడే నోటిఫికేషన్‌

నేటి నుంచి 5 వరకు దరఖాస్తుల స్వీకరణ

కేటగిరీల వారీగా రిజర్వేషన్‌

విధివిధానాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం 

స్థానికులకే అవకాశం.. దరఖాస్తు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌  

పట్టణాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో టెన్త్‌ అర్హత

18–35 మధ్య వయస్సు వారే అర్హులు 

ఎంపికకు మండల, పట్టణ స్థాయిలో అధికారుల కమిటీలు 

11 నుంచి ఇంటర్వ్యూలు.. ఆగస్టు 1న ఎంపికైన వారి జాబితా వెల్లడి 

ఆగస్టు 5–10 తేదీల మధ్య శిక్షణ.. అదే నెల 15 నుంచి విధుల్లోకి

సాక్షి, అమరావతి: గ్రామ– వార్డు వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వలంటీర్ల ఎంపికకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఆరంభిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరి ఇంటి వద్దకే డోర్‌ డెలివరీ చేయడం లక్ష్యంగా గ్రామాలు, పట్టణాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున వలంటీర్లను నియమిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించిన విషయం విదితమే. వీరి ఎంపికకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాల ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులోని నిర్ణీత ఫార్మాట్‌లో ఆన్‌లైన్‌లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌ వివరాలను ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్‌లో పేర్కొంటారు. జూలై ఐదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రామం, పట్టణ వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా వలంటీర్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. నియామకంలో రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు ప్రతి కేటగిరీలోనూ సాధ్యమైనంత వరకు 50 శాతం మహిళలకు అవకాశం కల్పిస్తారు. ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

వలంటీర్ల నియామకానికి అర్హతలు
- కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి.
18–35 ఏళ్ల మధ్య వయస్సు వారే దరఖాస్తుకు అర్హులు
ఏ గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు.

బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా 50 ఇళ్ల గ్రూపుల ఏర్పాటు 
బేస్‌ లైన్‌ సర్వే ఆధారంగా గ్రామం, వార్డులో ఉన్న కుటుంబాలను 50 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. మండల స్థాయిలో ఎంపీడీపీ, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీల కమిటీనే గ్రామాల వారీగా 50 ఇళ్ల గ్రూపులను కూడా వర్గీకరిస్తుంది. పట్టణాల్లో 50 ఇళ్ల గ్రూపులను మున్సిపల్‌ కమిషనర్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, మరొక సీనియర్‌ అధికారితో కూడిన కమిటీ వర్గీకరిస్తుంది. గ్రూపుల వర్గీకరణ తర్వాత గ్రామ, వార్డు స్థాయిలో 50 ఇళ్లకన్నా తక్కువ సంఖ్యలో కుటుంబాలు మిగిలిపోతే వారిని ఆ గ్రామం, వార్డులోని గ్రూపులతో సర్దుబాటు చేస్తారు.

ఎంపిక విధానం..
వలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు. 
ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో   జరుగుతుంది.
అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వూ్య కోసం పిలుస్తారు.
వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు. 
మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. 
వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.
ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ–వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది. 

వలంటీర్ల విధులు
- తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి. 
వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని గ్రామ– వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి.
తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ–వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి. అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి. వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.
​​​​​​​- తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి.
​​​​​​​- 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి.
​​​​​​​- గ్రామ– వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ.. తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి. 
​​​​​​​- ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.
​​​​​​​- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి.
​​​​​​​- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.

మరిన్ని వార్తలు