‘రియల్’.. ఢమాల్..!

15 Oct, 2014 23:58 IST|Sakshi
‘రియల్’.. ఢమాల్..!
  • రియల్టర్ల గుండెల్లో రైళ్లు
  •  స్తంభించిన లావాదేవీలు
  • విజయవాడ:  ఓ రియల్టర్  సెప్టెంబర్ మొదటి వారం గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామంలో ఎకరం రూ.1.40 కోట్లు చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. దాంట్లో  ఒక వంతు డబ్బు చెల్లించి 60రోజుల షరతుతో రిజిస్ట్రేషన్ చేయించుకునే విధంగా అగ్రిమెంటు రాయించుకున్నారు.  మరో రియల్టర్ నూజివీడు సమీపంలో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఒక ఎకరం రూ. 70 లక్షల చొప్పున కొనుగోలు చేసి 60 రోజుల షరతుపై బయానా ఇచ్చి అగ్రిమెంటు చేసుకున్నారు. జిల్లాలో రియల్ ఏస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయింది.

    రియల్టర్లు ఆందోళనలో ఉన్నారు. విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తామని ఆగస్టులో సీఎం చంద్రబాబు, అధికార పార్టీ నేతలు ఆర్భాటంగా చేసిన ప్రకటనలు నమ్మిన రియల్టర్లు తెగించి పొలాలు,  స్థలాలు కొనుగోళ్లు చేశారు. దాంతో వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు కూడా రియల్ ఏస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఇతర రకాల వృత్తుల్లో ఉన్న కాంట్రాక్టర్లు తదితరులు అతి తక్కువ టైమ్‌లో ఎక్కువ  లాభాలు పొందవచ్చనే భావనతో రియల్ ఏస్టేట్ రంగంపై దృష్టి సారించారు.  

    ఈ క్రమంలో ఆగస్టు నుంచి, సెప్టెంబర్ వరకు విజయవాడ పరిసర ప్రాంతాలైన గన్నవరం, కంకిపాడు, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, నందిగామ తదితర ప్రాంతాల్లో వందల కోట్ల రూపాయల రియల్ వ్యాపారం జరిగింది. భూములు, స్థలాల ధరలు మూడు  రె ట్లుపెరిగాయి. అమ్మేవారు లేకపోవడంతో రియల్టర్లు అమ్మడానికి దొరికిన భూమిని కొనుగోలు చేసేశారు. టోకెన్ బిజినెస్‌పై నాలుగోవంతు డబ్బు రైతులకు ఇచ్చి పొలాలు కొనుగోలు చేశారు.

    అక్టోబర్ నెలలో గుంటూరు జిల్లా  అమరావతిలో రాజధాని ఏర్పాటు అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడకేసింది. కొనుగోళ్లు నిలిచిపోయాయి. మారుబేరం చేసి లాభం కోసం పెట్టుబడి పెట్టిన వ్యాపారులు లావాదేవీలు నిలిచి పోయి నానా అగచాట్లు పడుతున్నారు. పొలం, స్థలం కొనుగోలుకు ఎవరూ రాకపోవడంతో రియల్టర్లు ఆలోచనలో పడ్డారు. గతంలో తమ ఆస్తులను విక్రయించిన వారు  మిగిలిన సొమ్ముకోసం తిరుగుతున్నారు.
     
    నిలువునా మునిగిపోయాం..
    ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి  రెండు మాసాల క్రితం భూములు  కొనుగోలు చేసిన మధ్యవర్తులు నిలువునా మునిగిపోయామని వాపోతున్నారు.  రాజధాని రాకపోతే రేట్లు పడిపోతాయని ఓ పక్క బ్రోకర్లు, మరో పక్క  రియల్టర్లు  కూడా టెన్షన్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా రైతాంగం మాత్రం భూసేకరణ ఉండదని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరిన్ని వార్తలు