పింఛాపై రియల్ కన్ను

6 May, 2015 02:11 IST|Sakshi

- గుట్టుచప్పుడు కాకుండా నదిని పూడ్చివేస్తున్న వైనం
- పట్టించుకోని అధికార యంత్రాంగం
పీలేరు:
దశాబ్దాల చరిత్ర కలిగిన పీలేరు పింఛా నదిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఏటి సమీపంలో కొంతమేరకు దురాక్రమణకు పాల్పడుతున్నారు. వందలాది మంది రైతులకు ఆధారమైన నది పరిసర ప్రాంతాలను రోజుకు కొంత చొప్పున మట్టితోలి చదును చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న పీలేరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూములకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టణ పరిసర ప్రాంతాల్లోని డీకేటీ భూములు, వాగులు, వంకలు, గుట్టలను చదునుచేసి ప్లాట్లు వేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అనతి కాలంలోనే లక్షలాది రూపాయలు గడిస్తున్నారు.

ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పీలేరు పరిసర ప్రాంతాల్లో పలు గుట్టలను చదును చేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. పీలేరు పట్టణానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఎవ్వరికీ ఇవ్వమని ఓ వైపు అధికారులు చెబుతున్నప్పటికీ మరో వైపు ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. తాజాగా పింఛా ఏటిని ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమేరకు మట్టితో పూడ్చి ఆక్రమించుకున్నారు. మదనపల్లె మార్గం లోని బడబళ్లవంక ఇప్పటికే ఆక్రమణకు గురైంది.

మరోవైపు కాకులారంపల్లె పంచాయతీ కోళ్లపారం గ్రామ సమీపంలో ఎన్నో ఏళ్లనుంచి ఉండే వంకను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి సిమెంట్ ఇటుకలతో మురుగునీటి కాలువ తరహాలో గోడ కట్టేశారు. పీలేరు పట్టణ నడిబొడ్డున వెళుతున్న అయ్యపునాయుని చెర్వు కాలువ అనేక చోట్ల ఆక్రమణకు గురైం ది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా ఎవరూ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు, పలువురు రైతులు వాపోతున్నారు. బోడుమల్లువారి పంచాయతీ పరిధిలోని బ్రిడ్జివద్ద భూములను చదునుచేసే క్రమంలో భాగంగా పింఛా నదిని కొంతమేరకు పూడ్చివేసి రాతికట్టడం కట్టేశారు. మరోవైపు నదిలో మట్టితోలి ఆక్రమణకు ఉపక్రమిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇకనైనా ఆక్రమణలు చోటుచేసుకోకుండా తగు చ ర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు