రైతుల భూముల్లో ‘రియల్‌’ చిత్రం

27 Feb, 2019 03:49 IST|Sakshi

రాజధానిలో భూముల విక్రయానికి గేట్లు బార్లా..

కార్పొరేట్, ఐటీ, వర్తక, వాణిజ్య సంస్థలకు విక్రయం

రియల్‌ ఎస్టేట్‌కు విక్రయాల్లో రాయితీలకు గ్రీన్‌సిగ్నల్‌

మాల్స్, హెల్త్‌కేర్‌ కేంద్రాలకు భూములు అమ్మకం

భూముల విక్రయంపై సీఆర్‌డీఏకు అధికారం కల్పించేలా చట్ట సవరణకు సిద్ధం

జర్నలిస్టులు, ఉద్యోగులు, జడ్జీలకు స్థలాల కేటాయింపు

ముసుగులో భూ కేటాయింపుల విధానంలో సవరణలు

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా సవరణలపై క్యాబినెట్‌ విధానపరమైన నిర్ణయం

సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో రైతుల నుంచి తీసుకున్న భూముల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. కార్పొరేట్, ఐటీ, వర్తక, వాణిజ్య సంస్థలకు భూములను విక్రయించాలని సోమవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో టీడీపీ సర్కారు విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఒకపక్క ఆదివారం నుంచి ఏడు జిల్లాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా సరే రాజధాని భూముల విక్రయంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఈ రెండు జిల్లాల పరిధిలోని రాజధాని భూముల కేటాయింపు విధానంలో సవరణలు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్టులు, ఉద్యోగులు, జడ్జీలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ముసుగులో రాజధాని భూ కేటాయింపుల విధానం – 2017లో టీడీపీ ప్రభుత్వం సవరణలు తెచ్చింది. ఈ సవరణల ద్వారా కార్పొరేట్‌ సంస్థలు, ఐటీ కంపెనీలు, వాణిజ్య, వర్తక సంస్థలు, మాల్స్, హెల్త్‌ కేర్‌ సెంటర్లకు భూములను విక్రయించేందుకు వీలుగా గేట్లను బార్లా  తెరిచారు. 

రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు విక్రయించేలా సవరణలు
ప్రస్తుతం రాజధాని భూ కేటాయింపుల విధానంలో మౌలిక వసతుల కల్పనకు మాత్రమే భూములను ఇవ్వాలని ఉంది. అయితే ఇప్పుడు వ్యక్తులకు కూడా భూములను కేటాయించవచ్చని సవరణలు తీసుకొచ్చారు. రియల్‌ ఎస్టేట్‌కు ప్రస్తుత విధానంలో భూముల కేటాయింపులకు వీలు లేదు. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూములను విక్రయించేలా సవరణలు తేవడం ద్వారా మార్గం సుగమం చేశారు. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు భూమి ధరలో రాయితీలు  ఇచ్చి మరీ విక్రయించాలని నిర్ణయించారు. అలాగే పెట్టుబడిదారులకు కూడా భూములను విక్రయించనున్నట్లు సవరణల్లో పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రాజధాని భూములను విక్రయించే అధికారాన్ని సీఆర్‌డీఏకు అప్పగించారు. రెసిడెన్సియల్‌ అవసరాలకు ప్రస్తుత భూ కేటాయింపు విధానంలో అవకాశం లేదు. ఈ నేపధ్యంలో సవరణలు చేస్తూ కార్పొరేట్‌ సంస్థలు, ఐటీ, రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు భూములను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రంగాలకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ సమావేశం నోట్‌లోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సీఆర్‌డీఏ చట్టంలో సవరణకు నిర్ణయం! 
భూసేకరణ చట్టం ద్వారా సేకరించిన భూమిని ప్రభుత్వం తరపున విక్రయించే అధికారం సీఆర్‌డీఏకు అప్పగించారు. అయితే సేకరించిన భూమి మాత్రమే అనే పదం ఉన్నందున భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన ఎటువంటి భూమినైనా అభివృద్ధి చేసిన లేదా అభివృద్ధి చేయకపోయిన భూములనైనా విక్రయించే అధికారాన్ని సీఆర్‌డీఏకు అప్పగిస్తూ సీఆర్‌డీఏ 2014 చట్టం సెక్షన్‌ 30లో సవరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి. రైతుల నుంచి మూడు పంటలు పండే భూములను సమీకరణ పేరుతో తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాటితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడంతోనే ఆగకుండా కార్పొరేట్‌ సంస్థలకు భూములను విక్రయించాలని నిర్ణయించడాన్ని అధికార వర్గాలు తప్పుపడుతున్నాయి. రాజధానిలో ఐటీ కంపెనీలకు రాయితీపై భూములను కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు