భూముల గుట్టు ‘రెవెన్యూ’కెరుక!

8 Nov, 2013 04:38 IST|Sakshi

కామారెడ్డి, న్యూస్‌లైన్: భూముల ధరలు పెరుగుతున్న కొద్దీ వివాదాలూ ముదురుతున్నాయి. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణం విస్తరిస్తుండడంతో శివారు గ్రామాల్లో భూముల ధరలు పెరిగి రియల్ వ్యాపారం జోరుగా సాగింది. ముఖ్యంగా పట్టణానికి సమీపంలోని టేక్రియాల్, ఇల్చిపూర్, అడ్లూర్, రామేశ్వర్‌పల్లి, సరంపల్లి, దేవునిపల్లి,  లింగాపూర్, నర్సన్నపల్లి, క్యాసంపల్లి తదితర గ్రామాల పరిధిలో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. అయితే అడ్డగోలు సంపాదనకు అలవా టు పడ్డ ‘కొందరు’  రెవెన్యూ ఉద్యోగులు డబ్బు ఆశకు రికార్డుల్లో లిటిగేషన్లు సృష్టించడం మూలంగానే భూముల గొడవలు పెరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.

ఇదే సమయంలో దళారుల మధ్యవర్తిత్వంతో రిజిస్ట్రేషన్ శాఖలోని అధికారులు, సిబ్బంది అక్రమాలకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. భూముల రికార్డులను తెలిపే పహాణీల్లో ఎన్నో సర్దుబాట్లు, దిద్దుబాట్లు చోటుచేసుకోవడం, అసలు పట్టేదారులు మాయం అయి, దళారుల పేర్లు చేరడం మూలంగా ఒకే భూమి ఇద్దరు, ముగ్గురు..నలుగురికి రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి. అలాగే కొన్ని చోట్ల అసలు పట్టాదారులు ఎప్పుడో అమ్ముకోగా, రికార్డుల్లో కొనుగోలు చేసిన వారి పేర్లు చేర్చకపోవడం మూలంగా దళారులు దాన్ని గమనించి సదరు రైతులకు ఆశ చూపి తిరిగి అవే భూములను అమ్మిపిస్తున్నారు.
 
 దీంతో ఏనాడో భూమిని కొనుగోలు చేసిన వారు, ఈమధ్యే కొనుగోలు చేసినవారు భూమి తమదంటే తమదంటూ కయ్యానికి దిగుతున్నారు. వారి వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెం ట్లను చూపుతున్నారు. ఒకే భూమిని ఇద్దరికీ అమ్మారంటూ  కొనుగోలు చేసిన వారంతా తమకు అమ్మిన వ్యక్తుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చివరకు సెటిల్‌మెంట్లు చేసే ముఠాలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఈ  వ్యవహారంలో పైసా పైసా కూడబెట్టి భూములు కొనుగోలు చేసినవారు రోడ్డున పడుతున్నారు. దళారులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు.  

గడచిన పదేళ్లుగా కామారెడ్డి పట్టణ శివార్లలో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంలోనే రికార్డులను తారుమారు చేసి పట్టాదారులను కాదని దళారులు అమ్ముకున్న భూ ములు ఎన్నో ఉన్నాయి. ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురికి అంటగట్టడంతో భూమి నాదంటే నాదంటూ కొనుగోలు చేసినవారు తన్నుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘కొందరు’ వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేయడం, దాని ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేసిపెట్టడంలో రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో భూములు కొనుగోలు చేసిన వారు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
 
 మచ్చుకు కొన్ని సంఘటనలు..
 కామారెడ్డి మండలం ఇల్చిపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే జాతీయ రహదారి, పాత జాతీయ రహదారి వెంట గుంటకు రూ. 3 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇక్కడి సర్వేనంబరు 134 కు సంబంధించిన భూమిలో ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సర్వేనంబరులో టేక్రియాల గ్రామానికి చెందిన ఓ రైతు తనకు సంబంధించిన భూమిని చాలా రోజుల క్రితమే విక్రయించాడు. అయితే రికార్డుల్లో పేరు అలాగే కొనసాగడంతో గమనించిన దళారులు రంగప్రవేశం చేసి సదరు రైతు కుటుంబ సభ్యులకు ఆశ లు కల్పించారు.
 
 ఆ భూమిని మరొకరికి అమ్మిం చారు. ఆ భూమిని తామేనాడో కొనుగోలు చేశామని ఒకరు, కాదు తామే కొనుగోలు చేశామని మరొకరు గొడవకు దిగారు. ఇదే సర్వే నం బరులో మరో రైతు తన పేరిట ఉన్న భూమితో పాటు తన పాలివారి పేరిట ఉన్న భూమిని కూడా అమ్ముకున్నాడు. దీంతో అక్కడ గొడవలు జరుగుతున్నాయి. పట్టాదారునికి కేవలం 22 గుంటల భూమి ఉంటే 33 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని సమాచారం. ఇదంతా దళారులు, రెవెన్యూ ఉద్యోగులు, రిజిస్ట్రేషన్ సిబ్బం ది అంతా కలిసి పన్నిన కుట్రలో భాగంగానే జరిగినట్టు తెలుస్తోంది.

ఇదే సర్వేనంబరులో క రీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పదేళ్ల క్రితం భూమిని కొనుగోలు చేశాడు. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆయన భూమి విలువ పెరిగిందని సంతోషించాడు. దుబాయ్‌లో ఉం డగానే భూమిని అమ్మమని కుటుంబ సభ్యుల కు తెలపడంతో వారు భూమిని విక్రయించారు. అయితే ఆ భూమి తమదంటూ వేరే ఓ ముఠా రంగంలోకి దిగడంతో ఆ కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు. దీంతో దుబాయ్‌లో ఉన్న సద రు వ్యక్తి ఇంటికి వచ్చి తెలిసిన వారి ద్వారా ఆ భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించుకున్నాడు. ఈ వ్యవహారంలో రూ. 10 లక్షలకు పైగా నష్టపోయాడు. ఇలాంటి సంఘటనలు నిత్యం ఎన్నో వెలుగుచూస్తున్నాయి.
 
 భూముల ధరలు పెరగడమే...
 రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యూహాత్మకంగా కామారెడ్డి ప్రాంతంలో భూముల ధరలు పెం చారు. భూముల ధరలు పెరిగినకొద్దీ అక్రమా లు పెరిగాయి. దీంతో వివాదాలు, గొడవలు చివరకు కోర్టు కేసులు, సెటిల్‌మెంట్లు.. ఇలా భూమి చుట్టూ తిరుగుతున్నాయి. తరువాత రియల్ భూం ఢమాల్‌మంది. దీంతో కొనుగో లు చేసినవారు అమ్ముకునే ప్రయత్నాలు చేయడంతో అసలు వివాదాలు వెలుగు చూస్తున్నా యి.ఘర్షణలు జరుగుతున్నాయి. దళారులతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ఉద్యోగులు చేతులు కలపడం మూలంగానే వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టమవుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు